* దాచిపెట్టిన డబ్బంతా గాంధీ కుటుంబానికి వెళ్తోంది
* నల్లధనం వెలికితీస్తుంటే నన్ను విమర్శిస్తున్నారు
* నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాను
* కొత్త చట్టం తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాం
* అవినీతిపరుల సొమ్ము పేదలకు చేరుతుంది
* ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు రాబోతోంది
* రాజమండ్రి సభలో ప్రదానమంత్రి నరేంద్ర మోదీ
ఆకేరు న్యూస్, రాజమండ్రి : యూపీఏ పాలనలో అన్నీ కుంభకోణాలే అని, నల్లధనాన్ని వెలికితీస్తుంటే తనను విమర్శిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని పునరుద్ఘాటించారు. రాజమండ్రి, వేమగిరిలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన కూటమి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొన్నారు. నా ఆంధ్రాప్రజలకు నమస్కారాలు… అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ.. దేశంలో కాంగ్రెస్, రాష్ట్రంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ చేసిన అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఓటమి అంగీకరించిందని, రాష్ట్రంలో వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి, డబుల్ ఇంజిన్ సర్కారు రాబోతుందని చెప్పారు.
మూడు రాజధానులన్నారు.. ఒక్కటీ కట్టలేదు.
రాష్ట్ర విభజన అనంతరం ఏపీని చంద్రబాబు అభివృద్ధిలో నంబర్ వన్‌గా ఉంచారని, వైసీపీ వచ్చాక అభివృద్ధిని ఆపేసిందని విమర్శించారు. వైసీపీ పాలన అవినీతిలో నంబర్ వన్ అన్నారు. మద్య నిషేధం చేస్తామన్న వైసీపీ.. నేడు దాంతోనే వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం, ఇసుక మాఫియా నడుస్తోందని వెల్లడించారు. మూడు రాజధానులు కడతామని ఒక్కటీ కూడా కట్టలేదని, ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ఆపేసిందని చెప్పారు. జూన్ 4 తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ప్రాజెక్టులను, పోర్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
అవినీతి కట్టడికి కొత్త చట్టం
జార్ఖండ్‌లోని ఓ కాంగ్రెస్ మంత్రి ఇంట్లో నోట్లకట్టలు బయటపడ్డాయని, అది ఒక్కటే కాదని అలాంటి ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయని మోదీ గుర్తుచేశారు. అందుకే ఈడీ.. ఈడీ.. అంటూ ఇండియా కూటమి నేతలు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. అవినీతి అరికట్టడానికి, నల్లధనం వెలికితీయడానికి కొత్త చట్టం తీసుకువచ్చేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని చెప్పారు. అవినీతిపరుల నుంచి నల్లధనం కక్కిస్తామని, అవినీతిపరుల సొమ్ము పేదలకు దక్కుతుందని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో దాచి పెట్టిన అవినీతి డబ్బంతా గాంధీ కుటుంబానికి వెళ్తోందని ఆరోపించారు.
వికసిత ఆంధ్రప్రదేశ్ కూటమి లక్ష్యం
వికసిత ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ లక్ష్యమని, వికసిత భారత్‌లో అది ఓ భాగమని తెలిపారు. అందులో భాగంగానే అమరావతి నుంచి విజయవాడ రహదారుల ప్రాజెక్టును వేగంగా పూర్తి చేశామని, ఏపీకి, హైదరాబాద్ ను కనెక్ట్ చేసేలా దారులను నిర్మిస్తాం అని తెలిపారు. రాజమండ్రి ఎయిర్‌పోర్టు అభివృద్ధి, విశాఖపట్నం రైల్వేజోన్, కాకినాడ పోర్టు వరకు ఫిషింగ్ హార్బర్ తదితర అభివృద్ధి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు హామీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాబోతుందని, ఎన్డీఏ పాలన వస్తేనే అభివృద్ధి సాధ్యం అని చెప్పారు.
——————————–