* దేశమంతా అదే నినాదం వినిపిస్తోంది..
* బీజేపీ, ఎన్డీఏ వెంటే ప్రజలు
* మోదీ గ్యారెంటీపై ప్రజలకు నమ్మకముంది
* కశ్మీర్లో శాంతికి గ్యారెంటీ
* హిందువులు, ముస్లింలు అంటూ కాంగ్రెస్ విభజన రాజకీయాలు
* ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని
ఆకేరు న్యూస్ డెస్క్ : దేశంలో ఎక్కడికి వెళ్లినా ఒకటే నినాదం వినిపిస్తోందని, అదే ఫిర్ ఏక్ బార్.. 400 పార్.. అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలందరూ బీజేపీ, ఎన్డీయే వెంటే ఉన్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్ అజాంఘడ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ.. సీఏఏ కింద భారత పౌరసత్వం ఇవ్వడం ప్రారంభమైందని తెలిపారు. మోదీ గ్యారెంటీపై ప్రజలకు నమ్మకం ఉందని, సీఏఏ చట్టమే తాజా ఉదాహరణ అని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో కూడా లక్షలాది మంది శరణార్ధులు ఉన్నారని, వీరంతా చాలా ఏళ్లుగా శరణార్దులుగా ఉన్నారని, అందరికీ భారత పౌరసత్వం లభిస్తుందని వివరించారు. మోదీ వెళ్తే సీఏఏ చట్టం, 370 ఆర్టికల్ వెళ్లిపోతాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎవరూ సీఏఏను తొలగించలేరని తెలిపారు. ఇండియా కూటమి నేతలు పేదల రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలని చూస్తున్నారని విమర్శించారు. పేదల అభ్యున్నతి కోసం తాను పగలు, రాత్రి కష్టపడుతున్నట్లు తెలిపారు.
కశ్మీర్లో శాంతికి గ్యారెంటీ
కశ్మీర్ లో శాంతికి మోదీ గ్యారెంటీ అని ప్రధాని తెలిపారు. కశ్మీర్లో కేంద్రం తీసుకున్న చర్యలతో విపక్షాల నోటికి తాళం పడిందని తెలిపారు. నాలుగో దశ ఎన్నికల్లో శ్రీనగర్ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారని వివరించారు. విపక్ష కూటమి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 70 ఏళ్లుగా హిందువులు, ముస్లింలు అంటూ విభజన రాజకీయాలు చేశారని ఆరోపించారు. రామ మందిరం ప్రారంభోత్సవం రోజున ఇండియా కూటమి ఎన్నో విమర్శలు చేసిందన్నారు. దేశంలో ఎక్కడ పేలుళ్లు, ఉగ్రదాడులు జరిగినా అజాంఘడ్ గురించి చర్చ జరిగేదని, స్లీపర్ సెల్స్ చర్చ జరిగేదని వివరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితులను మార్చేసిందన్నారు. సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ గురించి ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు.
ఓటు బ్యాంకు రాజకీయాలు
విపక్ష కూటమి ఇండియా.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ప్రధాని అన్నారు. పేదల రిజర్వేషన్లను ముస్లింలకు పంచుతామని పేర్కొంటోందని ఆరోపించారు. బీజేపీ అలాంటి రాజకీయాలకు దూరం అని తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, సౌర విద్యుత్ వినియోగించే వారికి కరెంట్ ఉచితంగా లభిస్తుందని వివరించారు.
———-