ఆకేరు న్యూస్ డెస్క్ : ప్రధాని మోదీ (Modi) రష్యా పర్యటన కొనసాగుతోంది. నిన్న సాయంత్రం జరిగిన మోదీ-పుతిన్ బేటీ ఫలితానిచ్చింది. భారత్ కు దౌత్య విజయం లభించింది. రష్యా (Russia) సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒప్పుకున్నారు. వెంటనే వారిని ఆర్మీ విధులను వెనక్కు రప్పిస్తామని, స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఒప్పుకున్నారు. సోమవారం సాయంత్రం జరిగిన ప్రధాని మోదీ.. ఫుతిన్ (Putin) ప్రైవేటు విందులో ఈ మేరకు అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. జూలై 4న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్‌కు ముందు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తన రష్యా కౌంటర్ సెర్గీ లావ్రోవ్తో ఈ విషయాన్ని గట్టిగా లేవనెత్తారు. రష్యన్ ఆర్మీలో చేరేందుకు భారతీయులు మోసపోయారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఘర్షణలో రష్యా సైన్యం రిక్రూట్ చేసుకున్న ఇద్దరు భారతీయులు మరణించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ జూన్‌లో పేర్కొనడం గమనార్హం. రష్యా సైన్యంతో ఉన్న భారతీయ పౌరులందరినీ ముందస్తుగా విడుదల చేసి, తిరిగి వచ్చే అంశాన్ని భారత్ చేపట్టింది. రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయ పౌరుల్లో 10 మంది భారతదేశానికి తిరిగి వచ్చినట్లు MEA ఏప్రిల్‌లో ధృవీకరించింది. లాభదాయకమైన ఉద్యోగాల సాకుతో ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో రష్యా సైన్యం కోసం పోరాడుతున్న దాదాపు 20 మందిని మోసగించారని ఆరోపించారు. ఇప్పుడు మోదీ పర్యటన అనంతరం వారిని భారత్ కు పంపేందుకు రష్యా అంగీకరించినట్లు తెలిసింది.
————————————-