Farmers Protest| ఆకేరు న్యూస్, పరకాల: హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారం గ్రామంలో గ్రీన్ఫీల్డ్ హైవే బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. తమ భూములకు, వాటిలో సాగు చేసిన పంటలకు ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించకుండానే హైవే నిర్మాణ పనులు చేపడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
పంట నష్టానికి పరిహారం ఇవ్వాలి
తమ భూములకు సంబంధించిన వివాదంపై హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినప్పటికీ, ఇప్పటివరకు తమకు నష్టపరిహారం అందలేదని రైతులు తెలిపారు. భూముల్లో సాగు చేసిన పత్తి పంటను దెబ్బతీస్తూ పనులు చేపట్టడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి పంట సాగు చేశామని, పరిహారం అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.
క్వింటాకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలి
ఒక ఎకరానికి కనీసం 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వస్తుందని రైతులు అంచనా వేస్తున్నారు. పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని క్వింటాకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ భూములు, పంటలకు తగిన నష్టపరిహారం వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
న్యాయం చేయాలని రైతుల విజ్ఞప్తి
తమ సమస్యను పరిష్కరించి నష్టపరిహారం చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఆందోళనకు గ్రీన్ఫీల్డ్ హైవే బాధిత రైతుల కమిటీ చైర్మన్ బూరుగుల రామచంద్రరావు నేతృత్వం వహించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

