* 8 కిలోమీటర్లు వర్షంలో పరుగెత్తిన కుక్క
* అనుసరించిన పోలీసులు
* భార్యను చంపుతున్న వ్యక్తి అరెస్ట్
ఆకేరు న్యూస్ , డెస్క్ : పోలీస్ జాగిలం (Police Dog) అందరి అభినందనలు అందుకుంటోంది.. కుండపోతగా కురుస్తున్న వర్షంలో ఏకంగా 8 కిలోమీటర్లు పరుగెత్తి మరీ జరగబోయే హత్యను ఆపింది. ఈ సంఘటన బెంగళూర్‌లో జరిగింది. దావణగెరె జిల్లాలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో సంతబెన్నూరులోని పెట్రోలు బంక్ సమీపంలో ఒక వ్యక్తి హత్యకు గురైనాడు. గమనించిన పాట్రోలింగ్ పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. జిల్లా ఎస్పీ ఉమా ప్రశాంత్ ఆదేశాల మేరకు వెంటనే హత్యాస్థలానికి చేరుకున్నారు. పోలీస్ జాగిలం తుంగ -2 మృతదేహం వద్ద వాసన చూసి పరుగు లంకించుకుంది. దాని వెంట పోలీసులు సైతం పరుగులు తీశారు. వర్షంలో ఏకంగా 8 కిలోమీటర్లు పరుగెత్తి చన్నాపురా అనే ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఒక ఇంటి దగ్గర ఆగిపోయింది.
అప్పటికే ఆ ఇంటి నుంచి మహిళ పెద్దగా అరుస్తున్న శబ్దాలు వినిపించాయి. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. రక్తపు టేరులో పడి ఉన్న మహిళ.. ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి కనిపించారు. వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వివరాలు ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. సంతోష్ (33) అనే వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానించి రంగ స్వామి హత్య చేశాడు. అనంతరం తన భార్యను కూడా అంత మొందించేందుకు సిద్దపడ్డాడు. సకాలంలో పోలీసులు. పోలీస్ జాగిలం స్పందించడంతో రంగ స్వామి భార్య తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలింగింది. పలువురు పోలీస్ జాగిలాన్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు.
——————————————-