
*సొంత పార్టీ వాళ్లే నన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడించారు
*ఆ లీకువీరులెవరో తెలియాల్సిందే
*బీఆర్ ఎస్ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేశారు
*పార్టీ నాది అని అందరూ కలిసి పోరాడితేనే ఫలితాలు
*లీకువీరులను పట్టుకోవాలంటే.. గ్రీకువీరులు నాపై దండెత్తారు
*నా జోలికి వస్తే బాగోదు
*కేసీఆర్ కు నోటీసులు వస్తే స్పందించరా.?
*మరో నాయకుడికి నోటీసులు వస్తే హడావిడి
*నాకు వెన్నుపోటు రాజకీయాలు రావు
*మరోసారి కేసీఆర్ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. తండ్రికి ఆమె రాసిన లేఖ బహిర్గతం అయినప్పటి నుంచీ సంచలనంగా మారింది. ఆమె కాంగ్రెస్ లో చేరతున్నారని, సొంత పార్టీ పెడుతున్నారని రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈక్రమంలో తాజాగా మరోసారి కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ లో కీలక అంశాలపై స్పందించారు.
నన్ను, కేసీఆర్ ను విడదీసే కుట్ర
తనను, కేసీఆర్ ను విడదీసే కుట్ర జరుగుతోందని కవిత అన్నారు. తన తండ్రిని, కుటుంబాన్ని వదిలి తాను ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు. కేసీఆర్ ఎలాంటి తప్పూ చేయలేదని అన్నారు. ఆయన నాయకత్వంలోనే తాను పని చేస్తానని స్పష్టం చేశారు.
మా పార్టీ వాళ్లే నన్ను ఓడించారు..
ఎంపీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ వాళ్లే తనను ఓడించారని కవిత ఆరోపణలు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నా పార్టీ స్పందించడం లేదన్నారు. దేశం వెలుపలా ఐటీ సెల్ లు పెట్టి తనపై పోరాడతామంటే ఎలా అని ప్రశ్నించారు. దొంగల్ని పట్టుకోవడం చేతకాక, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. లిక్కర్ కేసు వచ్చినప్పుడు తాను రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని వారించారని వెల్లడించారు. లీకు వీరులను ఎండగట్ట మంటే, గ్రీకు వీరుల్లా తనపై ప్రతాపం చూపుతున్నారని విమర్శించారు.
అది శుద్ధ అబద్ధం
కాంగ్రెస్, బీజేపీపై మాట్లాడాలి కానీ, తనపై దాడి చేస్తే ఎలా అని బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత పార్టీ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్ తో తాను మాట్లాడాను అనేది శుద్ధ అబద్ధం అన్నారు. తనను కేసీఆర్ కు, పార్టీకి దూరం చేస్తే ఎవరికి లాభం జరుగుతుందో ఆలోచించుకోవాలని తెలిపారు. తనది బీఆర్ ఎస్ పార్టీ అని, కాంగ్రెస్ మునిగిపోయే నావ అని అన్నారు. ఆపార్టీతో రాయబారాలు తనకెందుకని పేర్కొన్నారు. కడుపులో విషం పెట్టుకుని, బయటకు నవ్వుతూ ఉండనని అన్నారు.
నేను ఎవరి నాయకత్వంలోనూ పనిచేయను
పార్టీ నాదని ప్రతి ఒక్కరూ పోరాడితేనే ఫలితం ఉంటుందని కవిత తెలిపారు. తాను ఎవరి నాయకత్వం కింద పనిచేయనని, కేసీఆరే తన నాయకుడని తెలిపారు. దామోదరరావు, గండ్ర మోహనరావును ఎవరు పంపారో తనకు తెలియదన్నారు. వారు ఎవరికి దగ్గరో తెలుసు కదా అన్నారు. కొత్త పార్టీ ఎందుకు.. ఉన్న పార్టీని బాగు చేసుకుంటే చాలని అన్నారు. ఎంతో మంది నాయకులు వస్తుంటారని, తనకు కేసీఆర్ మాత్రమే నాయకుడని, హీరో అని కవిత తెలిపారు.
నా డిమాండ్ ఒక్కటే
తన డిమాండ్ ఒక్కటే అని, తాను తండ్రికి అంతర్గతంగా రాసిన లేఖను లీక్ చేసింది ఎవరో తెలియాల్సిందే, చెప్పాల్సిందే అన్నారు. కేసీఆర్ కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపరు.. మరో నాయకుడికి నోటీసులు వస్తే ఎందుకు హడావిడి అని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వారికలా చిచోరా రాజకీయాలు చేయబోనని, హుందాగా ఉంటానని తెలిపారు. పార్టీ చేయాల్సిన పనులను జాగృతి తరఫున తాను చేస్తున్నా అన్నారు. కోవర్టులు ఉన్నప్పుడు ఎందుకు పక్కన పెట్టడం లేదని ప్రశ్నించారు.
నా జోలికి వస్తే బాగోదని హెచ్చరిక
బీఆర్ ఎస్ ను గంపగుత్తగా బీజేపీకి అప్పగించే ప్రయత్నం జరుగుతోందని కవిత సంచలన ఆరోపణలు చేశారు. జైలులో ఉన్నప్పుడే తన వద్దకు ఆ ప్రతిపాదన వస్తే, వ్యతిరేకించా అన్నారు. బీజేపీలో విలీనం కాకుండా, బీఆర్ ఎస్ స్వతంత్రంగా ఉండాలి అనేదే తన అభిమతం అన్నారు. కేసీఆర్ ను తామే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారని, కేసీఆర్ ను నడిపించేంత పెద్ద వాళ్లా మీరు అని ప్రశ్నించారు. తన జోలికి వస్తే బాగోదని హెచ్చరించారు. తాను జైలులో ఉన్నప్పుడే తనపై కుట్రలు మొదలయ్యాయని అన్నారు.