
ఆకేరున్యూస్, హైదరాబాద్: డాక్టర్ భీమ్రావ్ రామ్‌జీ అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14న ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. సమాజానికి, రాజ్యాంగానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టారు. రాజ్యాంగ నిర్మాత, సమాజంలో సమానత్వం కోసం కొత్త శకాన్ని స్థాపించిన బాబా సాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతిని ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటినట్లు తన ఖాతాలో పోస్ట్ చేశారు. బీఆర్ అంబేద్కర్ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించడం పట్ల ప్రధాని మోదీ అంకిత భావం గుర్తించాలని ఆయన అన్నారు. దేశ ప్రజల మనోభావాలను గౌరవించి ప్రదాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. కాగా అంబేద్కర్‌పై బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ అంబేద్కర్ జయంతిని జాతీయ సెలవు దినంగా పాటించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా డాక్టర్ భీమ్రావ్ రామ్‌జీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో జన్మించారు. నవ భారతాన్ని రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దళిత ప్రజల మనుగడ కోసం ఆయన ఏకంగా భారత రాజ్యాంగాన్ని రచించి దేశ చరిత్రలో నూతన శకం రూపొందించారు.
……………………………………