Raidurg Land Auction Record
* ఎకరా రూ.264 కోట్లు
అకేరు న్యూస్ హైదరాబాద్ : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భూముల ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. రాయదుర్గంలోని పి-1 ప్లాట్ వేలంలో ఎకరా భూమికి ఏకంగా రూ.264 కోట్ల ధర పలికింది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహించిన ఈ వేలం హైదరాబాద్ భూముల వేలం చరిత్రలోనే అత్యధిక ధరగా నమోదైంది.
మొత్తం 5.25 ఎకరాల భూమి విక్రయంతో TGIICకి ఏకంగా రూ.1,386 కోట్ల ఆదాయం సమకూరింది. ఎకరాకు రూ.175 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించగా.. దానికంటే 50.9 శాతం అధిక ధరకు భూమి అమ్ముడుపోవడం విశేషం.
ఇదే ప్రాంతంలో గత మే నెలలో ఎకరాకు రూ.237 కోట్ల ధర పలికి రికార్డు నమోదైంది. తాజాగా రాయదుర్గం వేలంలో ఎకరాకు రూ.264 కోట్ల ధర రావడంతో ఆ రికార్డు కూడా బద్దలైంది.
ఐటీ, ఫైనాన్షియల్ హబ్‌లకు సమీపంలో ఉన్న రాయదుర్గం ప్రాంతానికి పెరుగుతున్న డిమాండ్, వాణిజ్య కార్యకలాపాల విస్తరణతో భూముల విలువ భారీగా పెరుగుతున్నట్లు తాజా వేలం మరోసారి స్పష్టం చేసింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో రాయదుర్గం ఎంత కీలకంగా మారిందో ఈ రికార్డు ధర చాటిచెబుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
