
* సైబరాబాద్ పోలీసుల సూచనలు
* సాఫ్ట్ వేర్ సంస్థలకు ఆదేశాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ ఆగమాగమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనాదారులు అయితే నరకం చూశారు. రోడ్లపై వరద నీరునిలిచిపోవడం వాహనం ముందుకు కదలలేదు. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించింది. నిన్న కూడా రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో అదే పరిస్థితి తలెత్తింది. ఆరంఘర్ ఫ్లై ఓవర్ వద్ద భారీగా వరద నీరు చేరింది. అలాగే ఈరోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. వర్షాల సమయంలో రోడ్డుపై వాహనాలు బారులు తీయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైటెక్ సిటీతో పాటు గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లోని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వీలైతే వర్క్ ఫ్రమ్ చేయాలని సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. అవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
……………………………………..