* సివిల్స్ ప్రిలిమ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు ఆర్థిక సాయం.
* సింగరేణి సంస్థ ద్వారా ఈ స్కీమ్ అమలు.
* జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.
* ప్రజా భవన్ లో “రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం” ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో స్కీమ్ ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని ఈ రోజు ప్రారంభించింది. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వారికి తెలంగాణ ప్రభుత్వం. ఆర్థిక సాయం అందించేందుకు గాను ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని (Rajiv Gandhi Civils Abhayahastam )తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ను శనివారం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో ప్రారంభించారు. సివిల్స్ ప్రిలిమ్స్‌కు ఎంపికైన అభ్యర్థుల కోసం ఉద్దేశించి ప్రవేశపెట్టిన స్కీమ్ ఇది.
ఈ పథకం కింద ఎంపికైన పేద అభ్యర్థులకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. సింగరేణి (Singareni) సంస్థ ద్వారా ఈ స్కీమ్ ను అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందన్నారు. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందని అన్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని చెప్పారు. అంతకుముందు సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు.
* జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం
“గత పదేళ్లలో నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగింది. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశాం. గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వాహించాం. డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్2 పరీక్ష వాయిదా వేశాం. ప్రభుత్వ ప్రధాన లక్ష్యం నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే. పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టనున్నాం. ఇక నుంచి ప్రతీ సంవత్సరం మార్చ్ లోగా అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పించుకుంటాం. జూన్ 2లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం” అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
——————————————-