
The danger lurking in the form of Singareni open cast
* వేయి అడుగుల లోతులో ఓపెన్ కాస్ట్
* 3 టీఎంసీ నిల్వ సామర్థ్యం ఉన్న చెరువు తెగితే సునామీయే
* దిగువ గ్రామాలన్నీ వాష్ అవుట్
* ప్రపంచ వారసత్వ కట్టడం కనుమరుగే
* స్పష్టం చేస్తున్న ఎన్జీఆర్ ఐ నివేదికలు
* సీఎంకు లేఖ రాసిన ప్రొఫెసర్ పాండురంగారావు
( చిలుముల్ల సుధాకర్ )
ఆకేరు న్యూస్ , వరంగల్ : చారిత్రాత్మక రామప్ప చెరువు ( Ramappa Lake ) కు ముప్పు పొంచి ఉంది. 3 టీఎంసీ (TMC )ల నిల్వ సామర్ధ్యం ఉన్న ఈ చెరువు తెగితే సునామీ తీవ్రతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఊళ్ళకు ఊళ్ళే నీళ్ళల్లో తేలియాడుతాయి. ప్రాణ నష్టం కూడా భారీగానే ఉంటుంది. ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం (Ramappa Temple ) ఆనవాళ్ళే కనుమరుగవుతాయి. ఇంత పెద్ద ఉపద్రవం ఎందుకు వస్తుందనుకుంటున్నారా..? సింగరేణి సంస్థ తలపెట్టిన ఓపెనకాస్ట్ మైన్ రూపంలో ఈ విలయం సంభవించబోతోంది. ఉపగ్రహ డేటా ఆధారంగా ప్రతిష్ఠాత్మక ఎన్ జీ ఆర్ ఐ ( NGRI )సంస్థ నివేదికలు ఈ విషయాన్నే హెచ్చరిస్తున్నాయి. ఇంతటి ఆపద ముంచుకొస్తుందని తెలిసినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
* రామప్ప చెరువు భూ గర్భంలో బీటలు
కాకతీయులు ( Kakatiyas ) గొలుసుకట్టు చెరువుల నిర్మాణానికి పెట్టింది పేరు. భూ విపత్తులను తట్టుకుని వెయ్యేళ్ళుగా సాగు, తాగు నీటి వనరులుగా ప్రజలకు జీవధార నిస్తున్నాయి. సహజ సిద్దమైన ప్రకృతి వనరులను ఉపయోగించుకుని భారీ తటాకాలను నిర్మించిన కాకతీయుల నిర్మాణ కౌశలం ఇప్పటికీ ఇంజనీరింగ్ నిపుణులను సైతం అబ్బుర పరుస్తోంది. ఆ కోవలోకి వచ్చేదే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట శివారు లో నిర్మించిన రామప్ప చెరువు. సహజ సిద్దమైన వరాల గుట్ట, వాన గుట్ట అ నే రెండు కొండల కేంద్రంగా 3 టీఎంసీ నిల్వ సామర్ధ్యం ఉన్న భారీ తాటాకాన్ని నిర్మించారు. ఆ కొండలే పెట్టని చెరువు కట్టలు గా ఉపయోగించుకున్నారు . 5 వేల ఎకరాల ఆయకట్టు అని ఆ కాలంలో నిర్ధారించినప్పటికీ దేవాదుల బాలన్సింగ్ రిజర్వాయర్ వల్ల ఏకంగా 15 వేల ఎకరాల ఆయకట్టుకు దీని ద్వారా సాగు నీరు అందుతోంది. అదే విదంగా సమీప ప్రాంతాలకు తాగు నీటి వనరుగా ఉపయోగపడుతోంది. 812 సంవత్సరాల క్రితం అంటే 1213లో కాకతీయ సేనాని రేచర్ల రుద్రుడు (Recharla Rudrudu )ఈ చెరువును నిర్మించాడు. వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ చెరువు భూ గర్భంలో చాలా మార్పులు వచ్చినట్లు నిపుణులు గుర్తించారు. సుదీర్ఘ కాలంగా భారీ స్థాయిలో నీటి నిల్వ వల్ల భూ పొరల్లో పగుళ్ళు ఏర్పడినట్లు గుర్తించారు. అదే విదంగా రామప్ప చెరువు కు కట్ ఆఫ్ ట్రెంచ్ లేక పోవడం కూడా చెరువు అంతర్భాగంలో బలహీన పడడానికి కారణమవుతోందంటున్నారు. ఇంతటి లోతైన అంశాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (NGRI )గుర్తించిందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. రామప్ప చెరువు భూ గర్భంలో రెండు ఫాల్ట్స్ ( పగుళ్ళు ) చెరువు మద్యలో నుంచి వెళతున్నాయి. ఇందులో ఒకటి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం సమీపంగా వెళుతోంది. మరొకటి ప్రతిపాదిత ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రాంతం గుండా పయనిస్తోంది. మరోకటి వరాల గుట్ట కింది భాగంలో మొదలై ప్రతి పాదిత ఓపెన్ కాస్ట్ మైన్ ప్రాంతం గుండా పయనిస్తోంది. రామప్ప చెరువు భూ పొరల్లో ఏర్పడిన మార్పుల వల్ల చెరువు దిగువ దిశగా ఈ పగుళ్ళు ఉండడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు. భూ అంతర్భాగంలో చీలికగా వెళుతున్న ప్రాంతంలో ఒక పెద్ద గొయ్యి తీసినప్పటికీ ఆ దిశగా నీటి ఉధృతి పెరుగుతుందంటున్నారు.ఏకంగా 300 మీటర్ల లోతు ఓపెన్ కాస్ట్ బొగ్గు బావి తవ్వితే రామప్ప చెరువు పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నీరు పల్లమెరుగన్న సత్యానికి అనుగుణంగా చెరువులోని నీరు ఒక్కసారిగా ఓపెన్ కాస్ట్ మైన్ వైపు దూసుకుపోతే పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. ఊళ్ళకే ఊళ్ళే వరద పాలయ్యే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.


* వంద అంతస్తుల ఎత్తంత… లో..తు
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (Singareni ) విస్తరణలో భాగంగా రామప్ప చెరువుకు కేవలం 5 కిలో మీటర్ల దూరంలోనే పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలను గుర్తించింది. ఇక్కడే భారీ స్థాయిలోపీవీ నరసింహారావు పేరుతో ఓపెన్ కాస్ట్ మైన్ (PV Narshmha Rao Open cast Mine ) తవ్వేందుకు సిద్దమైంది. ఈ బొగ్గు గనే రామప్ప చెరువు, రామప్ప ఆలయంతో పరిసర గ్రామాలకు పెను ప్రమాదంగా మారబోతోంది. ఈ ఓపెన్ కాస్ట్ మైన్ ఏకంగా 300 మీటర్లు లోతు అంటే వేయి అడుగుల లోతు తవ్వేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఇంకా అతి సులభంగా అర్థం చేసుకోవాలంటే లోతును ఎత్తులో చూడాలి. అంటే 300 మీటర్ల లోతుండే ఓపెన్ కాస్ట్ మైన్ ఎత్తులో చూస్తే ఏకంగా 100 అంతస్తుల భవనం నిర్మిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. ఇంత లోతుగా బొగ్గు నిక్షేపాలను వెలికితీయాలంటే సింగరేణి సంస్థ మినీ భూకంపాన్నే సృష్టించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భారీ యంత్రాలతో పాటు శక్తివంతమైన మందుగుండు ను ఉపయోగించి విస్ఫోటనాలను సృష్టించాల్సి ఉంటుంది. దీని వల్ల భూమి పొరల్లో పెద్ద ఎత్తున ప్రకంపనలు ఏర్పడుతాయి. భూగర్భ పగుళ్ళతో అప్పటికే బలహీనంగా ఉన్న రామప్ప చెరువు రక్షణ ప్రశ్నార్థకమవుతుందంటున్నారు. కాగా ములుగు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో 2023 మార్చి 1 వతేదీన జరిగిన పాలంపేట స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం జరిగింది. సింగరేణి సంస్థ అధికారులు ఈ సమావేశంలో పీవీనరసింహారావు ఓపెన్ కాస్ట్ మైన్ తవ్వేందుకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ( NOC ) కావాలని అడిగారు. అదే సమావేశంలో ఉన్న కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కు చెందిన ఎన్ ఐటీ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ పాండురంగారావు ( Prof Pandu Ranga Rao , NIT ) సింగరేణి అధికారుల ప్రతిపాదనను వ్యతిరేకించారు. రామప్ప పరిసర ప్రాంతాల్లో మైనింగ్ చేపడితే అనర్థాలు జరగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
* ప్రపంచ వారసత్వ కట్టడం మనుగడ ప్రశ్నార్థకమే..! ?
చారిత్రాత్మక రామప్ప ఆలయం చెరువుతో పాటే నిర్మించబడింది. అంటే ఆలయ నిర్మాణం చేపట్టి 812 సంవత్సరాలు అవుతోంది. ఇసుక పునాదులతో నిర్మించబడిన ఈ ఆలయం మరో ప్రత్యేకత నీటిలో తేలియాడే ఇటుకలు. ఈ ఆలయ శిల్ప సంపద అపురూపం. ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే 2021 జులై 25న యునెస్కో (UNESCO ) రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించింది. గతంలోనూ రామప్ప ఆలయానికి సమీపంలో దేవాదుల ప్రాజెక్ట్ పైప్ లైన్ల కోసం భారీ పేలుళ్ళు జరిపితే నిరసనగా ఒక ప్రజా ఉద్యమమే పెల్లుబికింది. ప్రజలంతా అనేక రూపాల్లో పోరాడి రామప్ప ఆలయాన్ని పేలుళ్ళ బారి నుంచి రక్షించుకున్నారు.. ఇపుడు ఓపెన్ కాస్ట్ రూపంలో ప్రపంచ వారసత్వ కట్టడానికి ముప్పు ఏర్పడుతోందన్న భయం వెంటాడుతోంది. రామప్ప చెరువు భూ గర్భంలో పగుళ్ళను చాలా కాలం క్రితమే ఎన్ జీఆర్ ఐ సంస్థ గుర్తించింది. ఇలాంటి వాటి వల్లనే రామప్ప ఆలయ సమీపంలోని సోమేశ్వరాలయం సైతం గతంలో కుంగి పోయింది. ఒపెన్ కాస్ట్ మైన్ తవ్వితే మాత్రం తప్పని సరిగా ప్రపంచ వారసత్వ కట్టడం మనుగడ ప్రశ్నార్థకమే అవుతుందని ఇంజనీరింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు..
* నిజమే.. ఓపెన్ కాస్ట్ మైన్ రూపంలో ముప్పు ముమ్మాటికి ఉంది..
– ప్రొఫెసర్ పాండు రంగారావు, విశ్రాంత ఆచార్యులు నిట్ కళాశాల, వరంగల్
ట్రస్టీ, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ .
Prof Pandu ranga rao..
రామప్ప చెరువుకు ముప్పు ఉందంటే ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప చెరువుకు సైతం అనివార్యంగా ఆపద ఉన్నట్టే.. రామప్ప చెరువుకు కేవలం 5 కిలో మీటర్ల దూరంలో సింగరేణి సంస్థ ప్రతిపాదించిన ఓపెన్ కాస్ట్ మైన్ వల్ల రామప్ప చెరువుకు, ఆలయానికి ముప్పు ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక కట్టడం రామప్ప ఆలయం మాత్రమే.. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ తరపున ముప్పు ఏ విదంగా పొంచి ఉందో సాంకేతిక ఆధారాలతో ప్రభుత్వ పెద్దలకు అందించాం. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, (Jishnu dev Varma ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) లకు సైతం వినతి పత్రాలు అందజేశాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఓపెన్ కాస్ట్ మైనింగ్ కు అనుమతి ఇవ్వకుండా చూడాల్సిన అవసరం ఉంది..
————————————————–