Rapido Parcel Service
* 62 వేల బంగారంతో రైడర్ పరార్
* పెట్రోల్ ఖర్చుల పేరుతో రూ.100 కూడా వసూలు..
* చివరకు నగలతో ఉడాయింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ర్యాపిడో బైక్ పార్శిల్ సేవలను ఉపయోగించుకున్న ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. బంగారు నగలను బంధువుల ఇంటికి పార్శిల్ పంపించగా, వాటిని తీసుకున్న డెలివరీ బాయ్ గమ్యస్థానానికి చేర్చకుండా పరారైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే..
బంజారాహిల్స్‌లో నివసించే వివో సంస్థ అడ్మిన్ మేనేజర్ తన బంధువులకు చెందిన ఇంటికి బంగారు నగలను పంపించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ర్యాపిడో బైక్ పార్శిల్ సేవలను వినియోగించుకున్నారు. నాగోలులోని బంధువుల ఇంటికి పంపించాల్సిన పార్శిల్‌ను సెక్యూరిటీ గార్డు ద్వారా ర్యాపిడో రైడర్‌కు అందజేశారు.
ఆ పార్శిల్లో సుమారు రూ.62,383 విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. పార్శిల్ తీసుకున్న రైడర్ పెట్రోల్ ఖర్చుల పేరుతో బాధితుడి నుంచి అదనంగా మరో రూ.100ను ఫోన్‌పే ద్వారా చెల్లింపుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పార్శిల్ గమ్యస్థానానికి చేరకపోవడంతో బాధితుడు ర్యాపిడో రైడర్‌కు ఫోన్ చేశాడు. మొదట స్పందించకపోగా, ఆ తర్వాత బాధితుడి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసి రైడర్ అందుబాటులో లేకుండా పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో బాధితుడు ర్యాపిడో కస్టమర్ కేర్‌ను సంప్రదించినప్పటికీ సరైన స్పందన రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. తనకు చెందిన బంగారు నగలు పార్శిల్లో మాయమయ్యాయని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. పార్శిల్ తీసుకున్న రైడర్ వివరాలు, ఫోన్‌పే లావాదేవీలు, ఇతర ఆధారాల ద్వారా నగలు ఎక్కడికి వెళ్లాయన్న కోణంలో విచారణ జరగనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

