* తప్పుడు వార్తలు తొలగించకపోతే చట్టపరమైన చర్యలు
* కుటుంబాన్ని వివాదాల్లోకి లాగడంపై రష్మిక ఫైర్
ఆకేరు న్యూస్, డెస్క్:నటి రష్మిక మందన్న తనపై మరియు తన కుటుంబంపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సాగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ, ఆమె ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారికి 24 గంటల గడువు విధిస్తూ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



అసలు వివాదం ఏమిటి?
ఇటీవల రష్మిక మందన్న, నటుడు విజయ్ దేవరకొండ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ శుభ సమయంలో, రష్మిక తల్లి సుమన్ మందన్నకు సంబంధించిన ఒక పాత ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. 2016లో ‘కిరిక్ పార్టీ’ సినిమా సమయంలో రష్మిక, కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ప్రేమలో పడి, 2017లో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 2018లో వారు విడిపోయారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ ఆనాటిదని, అందులో రష్మిక ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆమె తల్లి మాట్లాడుతున్నట్లు సమాచారం. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం నాటి వ్యక్తిగత సంభాషణను ఇప్పుడు కావాలనే బయటపెట్టడంపై రష్మిక ఆగ్రహం వ్యక్తం చేశారు.
రష్మిక వివరణ:
ఈ వివాదంపై రష్మిక స్పందిస్తూ.. “గత ఎనిమిదేళ్లుగా మీడియాలోని ఒక విభాగం, కొందరు వ్యక్తులు నాపై నిరంతరం అసత్య ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. వ్యూస్ కోసం నేను అనని మాటలను అన్నట్లుగా సృష్టించి, నాపై ద్వేషాన్ని పెంచారు. ఇంతకాలం మౌనంగా ఉన్నాను కానీ, గత 24 గంటల్లో జరిగిన పరిణామాలు అన్ని హద్దులనూ దాటేశాయి. అనుమతి లేకుండా ఒకరి వ్యక్తిగత సంభాషణను రికార్డ్ చేసి, అందులోని కొంత భాగాన్ని మాత్రమే వాడుకుంటూ వివాదం సృష్టించడం నా గోప్యతకు భంగం కలిగించడమే” అని పేర్కొన్నారు. తనను విమర్శించడం మాని, ఇప్పుడు తన కుటుంబాన్ని కూడా ఈ వివాదాల్లోకి లాగడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
24 గంటల డెడ్‌లైన్
తప్పుడు ప్రచారం చేసేవారికి రష్మిక గట్టి హెచ్చరిక జారీ చేశారు. సదరు ఆడియో క్లిప్‌ను లేదా దానికి సంబంధించిన తప్పుడు కథనాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వారు వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రకటన వెలువడిన 24 గంటల్లోపు ఆ కంటెంట్‌ను తొలగించకపోతే, సంబంధిత వ్యక్తులు మరియు సంస్థలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. తన గౌరవం మరియు కుటుంబ ప్రశాంతత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం రష్మిక తీసుకున్న ఈ కఠిన నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే వారికి ఇది ఒక గుణపాఠం కావాలని నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.
