
* అనర్హుల ఏరివేతకు కేంద్రం ఆదేశాలు జారీ
ఆకేరున్యూస్ డెస్క్ :ఆదాయపు పన్ను చెల్లిస్తూ రేషన్ పొందుతున్న రేషన్ కార్డు లబ్ధిదారులను తొలగించడం ఖాయమని తెలుస్తోంది. రేషన్ కార్డుల జాబితా నుంచి వారి ఏరివేతకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాత, కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇబ్బందిగా మారింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన మార్గదర్శకాలే నిదర్శనం.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద లబ్దిపొందుతున్న వారిలో అనర్హులను తొలగించడానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఆదాయ పన్ను శాఖ కేంద్ర ఆహార శాఖకు సహకారం అందించనుండగా లబ్ధిదారుల వ్యవహారం మంత్రిత్వశాఖలోని ఫుడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (బీఎఫ్పీడీ) విభాగానికి ఆదాయం పన్ను శాఖ సమకూర్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. లబ్దిదారుల ఆధార్ నంబర్ లేదా పాన్ వివరాలను ఆదాయ పన్ను శాఖకు డీఎఫ్పీడీ ఇవ్వనుండగా ,దీని ఆధారంగా లబ్ధిదారుని ఆర్థిక స్థితిగతులను ఆదాయపన్ను శాఖ నిర్ధారించి తిరిగి వివరాలను ఆహార శాఖకు అందించనుందని అధికారులు చెబుతున్నారు. ఈ నిబంధనల పరిధిలోకి వేల కుటుంబాలు వచ్చే అవకాశం ఉంది. రేషన్ కార్డుదారులు ఆదాయపు పన్ను చెల్లిస్తూ గృహ, వాహన ఇతర అవసరాల కోసం రుణాలు తీసుకున్న కుటుంబాలు వేలల్లో ఉన్నాయి. వారందరికీ ఈ నిబంధన పూర్తిస్థాయిలో అమలయితే మాత్రం రేషన్ కార్డులు కోల్పోతారు. రేషన్ కార్డు రద్దవడంతోపాటు ఆరోగ్యశ్రీ ఇతర సంక్షేమ పథకాలకు దూరమవుతారు. కేంద్ర ఆదేశాలపై రేషన్ కార్డుదారుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
……………………………………