* 6 కిలోలకు 5 కిలోలే రేషన్ బియ్యం
* డయల్ 100కు చేసిన వినియోగదారులు
* వెంటనే చేరుకున్న పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
‘మీకు దిక్కున్న చోట చెప్పుకో. బియ్యం అంతే ఇస్తా. ఏం చేస్తారో చేసుకోండి’ అంటూ ఓ రేషన్ డీలర్ వినియోగదారులతో దురుసుగా వ్యవహరించాడు. కార్డులో నలుగురు సభ్యులు ఉంటే.. ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున 24 కిలోలు ఇవ్వాల్సింది పోయి.. 22 కిలోలే ఇచ్చాడు. ఇదేంటని ప్రశ్నించిన వినియోగదారుడికి దురుసుగా బదులిచ్చాడు డీలర్. పైగా మాకూ ప్రభుత్వం తగ్గించి ఇస్తోందని చెప్పాడు.
కూకట్పల్లి డివిజన్ పరిధిలో ఆస్బెస్టాస్ కాలనీలో సమీపంలోని లక్కిబార్ సమీపంలో ఉన్న రేషన్ దుకాణంలో డీలర్ తన ఇష్ఠానుసారంగా నడిపిస్తున్నారని పలువురు కాలనీవాసులు వాపోతున్నారు. ఏకంగా కూకట్పల్లి గ్రామంలో ఉన్న సామాజిక మాధ్యమంలో రేషన్ దుకాణంలో జరుగుతున్న తంతుని వీడియో తీసి, సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఇదే విషయమై కాలనీవాసులను వివరణ కోరగా రేషన్ దుకాణంలో ఎన్నో నెలలుగా ఇదే తంతు జరుగుతోందని తెలిపారు. మూడు నెలలకు ఒకసారి బియ్యం ఇచ్చిన సమయంలోనూ సామాన్యులు..మద్యతరగతికి ప్రజలకు అందించాల్సిన బియ్యం తూకంలో తేడాలున్నాయని ఇదే విషయం రేషన్ డీలర్‌ను నిలదీయడంతో డీలర్ పొంతన లేని సమాదానం ఇస్తున్నారని డీలర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇంట్లో ఉన్న ఒక్కరికి 6 కిలోల చోప్పున రేషన్ కార్డులో ఎన్ని పేర్లు ఉంటే అంత మందికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. భార్యభర్తలు ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వారికి 24 కిలోలు రావాల్సిన బియ్యం తూకంలో మాత్రం 22 కిలోలు వస్తున్నట్లు వాపోయారు.
100 డయల్ చేసిన కాలనీవాసులు
నీ ఇష్టం ఇచ్చిన చోట ఫిర్యాదు చేసుకో అనడంతో కాలనీవాసులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక 100కి డయల్ చేశారు. దాంతో అక్కడికి జగద్గిరిగుట్టకు చెందిన పోలీసులు రేషన్‌దుకాణం కు చేరుకున్నారు. అక్కడ జరిగిన విషయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తూకం మిషన్ స్వాధీనం చేసుకుని వెళ్లిపోయారు. కాగా, ఆస్బెస్టాస్ కాలనీ సమీపంలో ఉన్న రేషన్ దుకాణంపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్ఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
………………………………………………………
