* 46 ఏళ్ల తర్వాత రహస్యగదిలోకి..
* అంతులేని సంపద లెక్కింపునకు సన్నాహాలు
* రూ. లక్షల కోట్లు ఉంటుందని అంచనా
* గదిని తెరిస్తే అరిష్టమని ప్రచారం
* ఆమేరకు తగిన చర్యలు తీసుకున్న ప్రభుత్వం
ఆకేరు న్యూస్ డెస్క్ : అదో రత్న బాంఢాగారం.. లక్షల కోట్ల విలువైన సంపద ఉంటుందన్న అంచనా.. చుట్టూ పాములు కాపలా ఉంటాయనే ప్రచారం.. తెరిస్తే అపచారం.. వంటి వార్తలలతో ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలోని బాంఢాగారం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిగా మారింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఆ బాంఢాగారం తెరిపిస్తోందని తెలియడంతో ఆ క్షణం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆ క్షణం వచ్చేసింది. 46 ఏళ్ల తర్వాత పూరీ బాంఢాగారం తెరుచుకుంది. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ ఆదేశాలతో అధికారులు భాండాగారం తలుపులను తెరిచారు. ఆ రహస్యగదిలోని నిధిని బయటకు తేనున్నారు. ఇతర ప్రాంతాలకు తరలించి లెక్కించేందుకు 5 భారీ చెక్కపెట్టెలను లోపలకు తీసుకెళ్లారు. గదిని తెరిస్తే అరిష్టమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంలో ఆమేరకు రక్షణ చర్యలు తీసుకుంది.
వెలకట్టలేని ఆభరణాలు, వజ్రవైఢుర్యాలు
ఒడిశా ప్రభుత్వం నియమించిన 16 మంది సభ్యుల బృందం.. రహస్య గదిలోకి వెళ్లింది. పాములు ఉంటాయనే నేపథ్యంలో ఈ బృందంతో పాటు స్నేక్క్యాచర్స్ కూడా లోనికి వెళ్లారు. దాంతో, పూరీ జగన్నాథ్ నిధి లెక్కింపుపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధికారంలోకి వస్తే పూరీ భాండాగారాన్ని తెరిపిస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. అందుకోసం జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలో కమిటీని కూడా నియమించింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడు రహస్య గదిని తెరిచింది ప్రభుత్వం. మధ్యాహ్నం ఒంటి గంటన్నర తర్వాత ఈ భాండాగారాన్ని ఓపెన్ చేశారు. భాండాగారాన్ని ఓపెన్ చేసేందుకు సకల జాగ్రత్తలు చేపట్టింది అధికార యంత్రాంగం. రహస్య గదిలో కింగ్ కోబ్రా లాంటి విష సర్పాలు ఉన్నాయనే భయంతో పాములు పట్టేవాళ్లను రెడీ చేశారు. ఎవరినైనా కాటు వేస్తే రక్షించడానికి వైద్యసిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచారు. 12వ శతాబ్దంలో పూరీ జగ్ననాథునికి అనేక వజ్ర, రత్నాభరణాలు సమర్పించారు. ఒడిషాను పాలించిన అనేకమంది రాజులతోపాటు నేపాల్ పాలకులు సైతం ఇక్కడి స్వామికి అత్యంత విలువైన వజ్రవైఢూర్యాలు కానుకలుగా ఇచ్చారు. మిగతా రాజులు సైతం యుద్ధాల్లో గెలుచుకున్న ధనరాశులను స్వామికి సమర్పించారు. వీటిన్నింటినీ ఆలయం కింద రహస్య గదుల్లో భద్రపరిచారు. వీటి విలువ లక్షల కోట్ల విలువ ఉంటుందని భావిస్తున్నారు.
1978 తర్వాత మళ్లీ ఇప్పుడే..
పూరీ రత్న బాంఢాగారాన్ని చివరిసారిగా 1978లో ఓపెన్ చేశారు. అప్పట్లోనే సంపదను లెక్కించేందుకు 70 రోజుల సమయం పట్టిందట. ఇప్పుడు మళ్లీ 46ఏళ్ల తర్వాత ఈ రహస్య గదిని తెరిచారు. పూరీ జగన్నాథుని ఆలయం కింద రెండు భాగాలుగా సంపద ఉన్నట్లు తెలుస్తోంది. కింది భాగంలో ఈ రహస్య గది ఉంది. ఇందులో మొత్తం 5 చెక్కపెట్టెలు ఉన్నాయి. ఒక్కో పెట్టె పొడవు 9 అడుగులు, 3 అడుగుల ఎత్తు ఉన్నట్టు గత నివేదికలు చెబుతున్నాయి. ఈ పెట్టెల్లో అత్యంత విలువైన వజ్ర వైఢూర్యాలు, స్వర్ణాభరణాలు, వెండి వస్తువులు ఉన్నాయి. 1805లో మొదటిసారి పూరీ జగన్నాథుని నిధి గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది. అప్పటి బ్రిటీష్ కలెక్టర్ చార్లెస్ గ్రోమ్ ఆ నిధిని లెక్కించారు. అప్పటి లెక్క ప్రకారం భాండాగారంలో రత్నాలు, మేలిమి బంగారం, వెండి వస్తువులు ఉన్నాయి. అందులో 64 వజ్రాభరణాలు, 128 బంగారు నాణేలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణేలు, 106 రాగి నాణేలు, 1333 రకాల వస్త్రాలు ఉన్నట్టు రిపోర్ట్ ఇచ్చారు చార్లెస్. ఆ తర్వాత 1950లో మరోసారి నిధిని లెక్కించారు. అప్పటి నివేదిక ప్రకారం బయటి గదిలో 150 బంగారు ఆభరణాలు.. లోపలి గదిలో 180 రకాల ఆభరణాలు, 146 వెండి వస్తువులు ఉన్నట్టు ప్రకటించారు.
సంపద లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుందంటే..
ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. ఈనెల 19వరకు జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపలే ఉంటారు. పైగా శ్రీక్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతుంటాయ్. వీటితోపాటు నిర్ణీత వేళల్లో సేవాయత్లు చేపడతారు. ఈ సేవలకు అంతరాయం కలుగకుండా ఈ ప్రక్రియ మొత్తం జరగనుంది. అయితే, నిధి లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుందనేది పని మొదలయ్యాకే తెలుస్తుంది. రహస్య గదిలోకి వెళ్లేవాళ్లంతా వారంరోజులుగా శాకాహారం మాత్రమే భుజిస్తూ నియమ నిష్టలు పాటించారు. వీళ్లందరూ ఇవాళ సంప్రదాయ వస్త్రధారణతో ఆలయంలోకి ప్రవేశించారు. మొదట జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. రహస్య గదిలోకి వెళ్తారు. లోపలికి వెళ్లాక స్వర్ణకారులు, శాస్త్రవేత్తల పర్యవేక్షణలో లెక్కింపు చేపడతారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియోగ్రఫీ చేయనున్నారు.
—————————–