Arnab Cyclone alerts Rayaparthi MPO Kuchana Prakash
* భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
ఆకేరు న్యూస్, రాయపర్తి : వాతావరణ శాఖ అందించిన తాజా హెచ్చరికల ప్రకారం.. రానున్న 24 నుంచి 48 గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం లేదా తుఫాను ప్రభావం రాయపర్తి మండలంపై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మండల వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు మండల యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని ఎంపీఓ కూచన ప్రకాష్ తెలిపారు. ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
* ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలి..
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, పసిపిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
* విద్యుత్ భద్రతపై అప్రమత్తత అవసరం..
ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడినా, తడిసిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల సమీపానికి వెళ్లవద్దని సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో టీవీలు, ఫ్రిజ్‌లు తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణాల ప్లగ్‌లను తొలగించి, విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
* వాగులు, వంకలు దాటొద్దు..
మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉందని హెచ్చరించారు. కాజ్‌వేలు, ఉప్పొంగుతున్న నీటి ప్రవాహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటవద్దని సూచించారు. పశువులు, మూగజీవాలను సైతం వాగుల వైపు తోలవద్దని కోరారు.
* అత్యవసర వస్తువులను సిద్ధం చేసుకోవాలి
ఇళ్లలో మొబైల్ ఫోన్లు, ఎమర్జెన్సీ లైట్లు, టార్చ్లైట్లను ముందుగానే పూర్తిగా ఛార్జ్ చేసుకోవాలని సూచించారు. తాగునీరు, నిత్యావసర వస్తువులు, అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
* సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి..
శిథిలావస్థలో ఉన్న పాత మట్టి ఇళ్లు, బలహీనమైన రేకుల ఇళ్లలో నివసించే ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పునరావాస కేంద్రాలను (రిలీఫ్ క్యాంపులు) సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
* రైతులు ధాన్యాన్ని కాపాడుకోవాలి
కష్టపడి పండించిన పంట, చేతికి వచ్చిన ధాన్యం వర్షానికి తడవకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యాన్ని వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలించాలని లేదా టార్పాలిన్లతో కప్పి తడవకుండా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
* అత్యవసర సహాయం కోసం సంప్రదించండి
మండల పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినా, సహాయం అవసరమైనా వెంటనే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.
*వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్: 9063000090
అత్యవసర సహాయం లేదా ఫిర్యాదుల కోసం పై వాట్సాప్ నంబర్‌కు సందేశం పంపవచ్చని తెలిపారు. మన రక్షణ మన చేతుల్లోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందకుండా అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని ఎంపీఓ కూచన ప్రకాష్ కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

