* ఏడుగురికి గాయాలు.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమం
* ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
ఆకేరు న్యూస్, కామారెడ్డి: తల్లి అంత్యక్రియల కోసం చేసిన అప్పు తీర్చే విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం చోటుచేసుకోవడంతో పరస్పర దాడులు చేసుకున్నారు. వీరిలో ఏడుగురు గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చామకూర శంకర్, మాధవ్ అన్నదమ్ములు. వీరు వేర్వేరుగా వ్యాపారం చేసుకుంటున్నారు. వీరి తల్లి నర్సవ్వ (92) ఈ నెల 19న మృతిచెందారు. ఈమె అంత్యక్రియల కోసం బంధువులు రూ.40వేలు అప్పుతెచ్చి కర్మకాండలు నిర్వహించారు. అయితే ఖర్చుల విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదాలు తలెత్తాయి. తల్లి దాచుకున్న డబ్బు రూ.లక్ష మాధవ్ వద్దనే ఉందని అప్పు తానే తీర్చాలని అన్న శంకర్ వాదించాడు. అందుకు మాధవ్ ఒప్పుకోలేదు. దీనిపై గురువారం పంచాయతీ పెట్టాలని శంకర్ బుధవారం రాత్రి బంధువులతో మాట్లాడుతుండగా మాధవ్ మద్యం మత్తులో తీవ్రంగా వాదించాడు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకొని పరస్పర దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మాధవ్ అతడి భార్య తీవ్రంగా గాయపడ్డారు. వీరిని బంధువులు నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శంకర్ ఆయన కుమారుడు బాలులాల్, కుమార్తె గంగామణికి తీవ్రగాయాలవడంతో బాన్సువాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శంకర్ కోడలు రజి, మాధవ్ కుమారుడు రాములుకు స్వల్ప గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.