* ఏడేళ్ల తరువాత రికార్డు స్థాయిలో నమోదు
* పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తప్పనిసరంటున్న వైద్యులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రం ఇక.. తీవ్ర చలి గుప్పిట్లోకి వెళ్లనుంది. నవంబర్ నెలలో గత ఏడు సంవత్సరాల తరువాత రికార్డు స్థాయి చలి నమోదు కానుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు రాత్రి వేళల్లో తీవ్ర చలికి వణికిపోతున్నారు. ఈ సారి ఎండాకాలంలో తీవ్ర ఎండలు కొట్టగా.. వర్షకాలంలో అదే స్థాయిలో భారీ వర్షాలు కురిశాయి. రానున్న రెండు మూడు వారాలూ రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని.. దీంతో రాత్రి సమయాల్లో చలిగాలుల తీవ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో చలి మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో ఈశాన్య రుతుపవనాల దిశ పూర్తిగా మారి.. వర్షపాతం తగ్గి.. అదే సమయంలో వాతారణ వ్యవస్థలో అణచివేత దశ ఉండడంతో పొడి వాతావరణం కొనసాగుతుందని.. దీంతో రాత్రి వేళల్లో తీవ్ర చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
