* మీర్జాగూడ ప్రమాదంపై హెచ్ఆర్సీ ఆదేశం
* రవాణ, హోం, భూగర్భ శాఖలకు నోటీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన టిప్పర్ – బస్సు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం (STATE HUMAN RIGHTS COMMISSION) స్పందించింది. ఈ ప్రమాదంలో ఏకంగా 19 మంది చనిపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఎందుకలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలేంటి అనే దానిపై డిసెంబర్ 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని రవాణా శాఖ, హోం శాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారిని, రంగారెడ్డి కలెక్టర్, ఆర్టీసీ ఎండీని నివేదిక పంపాలని కూడా పేర్కొంది. తాండూరు నుంచి హైదరాబాద్ (TANDOOR TO HYDERABAD) వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును అతివేగంగా వచ్చిన కంకర టిప్పర్ బలంగా ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. టిప్పర్ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తోపాటు టిప్పర్ డ్రైవర్ కూడా దుర్మరణం చెందారు. వీరితోపాటు 17 మంది ప్రయాణికులు చనిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే కేసు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధిత శాఖలకు నోటీసులు జారీ చేసింది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందించాలని పేర్కొంటూ డిసెంబరు 15 డెడ్‌లైన్ విధించింది.
………………………………………………
