*ప్రాణాపాయంలో విశ్రాంత ఉపాధ్యాయుడు!
* ముప్పై ఏళ్లు ఊపిరి పోసిన చదువు..
* నేడు శ్వాస కోసం పోరాటం!
ఆకేరు న్యూస్ , హన్మకొండ:
ఆయన కొన్ని వేల మంది విద్యార్థులకు భవిష్యత్తును ఇచ్చారు. తరగతి గదిలో పాఠాలు చెబుతూ ఎందరినో ప్రయోజకులను చేశారు. మూడు దశాబ్దాల పాటు సమాజానికి వెలుగునిచ్చిన ఆ ఉపాధ్యాయుడు, నేడు సొంత వైద్యం కోసం చిల్లిగవ్వ లేక విల విల్లాడుతున్నాడు ..
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ సమ్మిరెడ్డి పరిస్థితి ఇది.
2024 జూన్లో ఆయన పదవీ విరమణ పొందినప్పుడు, అటు కుటుంబ సభ్యులు, ఆయన ఒకే ఒక ఆశతో ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత వచ్చే సొమ్ముతో ఐదేళ్లుగా బాధిస్తున్న పక్షవాతానికి మెరుగైన వైద్యం చేయించుకోవచ్చని భావించారు. కానీ విధి వంచించింది, వ్యవస్థ వేధించింది. ఆరు నెలలు గడిచినా, రావాల్సిన బెనిఫిట్స్ అందకపోవడంతో.. తన కష్టార్జితం కోసం ఎదురుచూస్తూ ఆయన మానసిక వేదనకు గురయ్యారు. ఆ ఆవేదనే నేడు ఆయన కిడ్నీలను దెబ్బతీసి, మృత్యువు అంచున నిలబెట్టింది.
* దిక్కు తోచడం లేదు
భార్య : ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్న సమ్మిరెడ్డి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. రోజుకు 60 వేల రూపాయల ఖర్చు అవుతుండటంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది.
> “నా భర్త వేలాది మంది పిల్లలను తీర్చిదిద్దారు. కానీ ఈరోజు ఆయన ప్రాణాలు కాపాడుకోవడానికి మా దగ్గర ఏమీ లేదు. మా సొంత డబ్బు మాకు ఇప్పించండి.. నా భర్తను బతికించుకునే అవకాశం ఇవ్వండి” అంటూ ఆయన భార్య జ్యోతి రెడ్డి వేడుకుంటున్న తీరు అందరినీ కలచివేస్తోంది.
>
సర్కార్ నిర్లక్ష్యం : వృద్ధాప్యంలో శాపం
ఈ పరిస్థితి ఒక్క సమ్మిరెడ్డిది మాత్రమే కాదు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 65 మంది విశ్రాంత ఉద్యోగులు తమ బకాయిలు అందక, సరైన వైద్యం లేక కన్నుమూశారని రిటైర్డ్ అసోసియేషన్ నాయకులు ధర్మేంద్ర, భోగేశ్వర్ లు ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మిరెడ్డి కి రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి, ఆయనకు ఉచిత వైద్యం అందేలా చూడాలి.
అక్షరాలు నేర్పిన గురువుకు ఈ పరిస్థితి రావడం సమాజానికి మంచిది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు..
