
* ఇచ్చిన హామీలపై చిత్తశుద్దిలేని ప్రభుత్వం
* మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: రైతుభరోసా అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన మాటను నిలబెట్టుకోలేదని మాజీ మంత్రి హరీష్రావు తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన సోషల్ విూడియా వేదికగా పోస్ట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, మాట తప్పడం, రైతులను మోసం చేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. జనవరి 26న రైతు భరోసా కింద ఇచ్చే డబ్బులను మార్చి 31లోగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారని, ఆ హామీ ఇంకా నెరవేరలేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ మార్చి 31 కల్లా రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని హామీ ఇచ్చారని.. కానీ ఏప్రిల్ 1వ తేదీ వచ్చినా.. ఆ నిధుల గురించి ఎలాంటి ప్రకటన రాలేదని ఆయన మండిపడ్డారు. ఉగాది పండుగను పురస్కరించుకుని రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూశారని, అయితే వారికి ప్రభుత్వం చేదు అనుభవం మిగిల్చిందని హరీష్ రావు విమర్శించారు. దసరాకు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, సంక్రాంతికి అందిస్తామన్నా నిధులు రాలేదని, ఉగాది నాటికి కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడం బాధాకరమన్నారు. క్యాలెండర్లు మారుతున్నా రేవంత్ రెడ్డి మాట మాత్రం మారడం లేదని ఎద్దేవా చేశారు. నాట్ల సీజన్లో కేసీఆర్ రైతులకు రైతు బంధు అందించారని, కానీ రేవంత్ రెడ్డి కోతల సమయం వచ్చినా రైతు భరోసా అందించలేకపోయారని హరీష్రావు ఆరోపించారు. మోసపూరిత పాలననే విధానంగా మార్చుకున్న రేవంత్ రెడ్డి రైతులను అన్ని కోణాల్లో దగా చేస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ వాగ్దానం ఇంకా నెరవేరలేదు. ఇందిరమ్మ భరోసా పథకం కేవలం మాటలకే పరిమితమైంది. హావిూలు నెరవేర్చకుండా మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే, అసెంబ్లీలో ప్రకటించినట్లుగానే రైతు భరోసా నిధులు అందించే వరకు బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటుందని.. ప్రజల్లో విూ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటుందని హరీష్ రావు హెచ్చరించారు.
………………………………