* ఢిల్లీలో భేటీ.. రాహుల్.. ఇతర కీలక నేతలకు కూడా..
ఆకేరు న్యూస్, డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మోదీతో సమావేశమయ్యారు. అతి త్వరలో తెలంగాణలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆయనను సాదరంగా ఆహ్వానించారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌కు రావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వాన పత్రిక అందించారు. పార్లమెంట్లో ప్రధానితో జరిగిన ఈ భేటీలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ప్రధానికి అందించారు. కేంద్ర ప్రభుత్వవికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా.. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని ప్రధానికి సీఎం రేవంత్ వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు చెప్పారు.
తెలంగాణ అభివృద్ధిపై చర్చ
అలాగే.. తెలంగాణ అభివృద్ధికి చేపడుతున్న అభివృద్ధి పనులను కూడా మోదీకి రేవంత్ వివరించారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు తగిన అనుమతులు ఇవ్వాలని కోరారు. మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేసింది. రూ.43,848 వేల కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపట్టేందుకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వాలని, దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగుళూరు హై స్పీడ్ కారిడార్ ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చోరవ చూపాలని సీఎం రేవంత్ కోరారు. పలు అభివృద్ధి పనుల వివరాలతో కూడిన వినతపత్రాన్ని మోదీకి రేవంత్ అందజేశారు.
