
* హెచ్ సీయూ భూముల వెనుక వేల కోట్ల బాగోతం
* 2 రోజుల్లో ఆ అవినీతి బయట పెడతా
* ఆయన విఫల సీఎం కాబట్టే హైకమాండ్ జోక్యం చేసుకుంటోంది
* బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి ముఖ్యమంత్రి అని, హెచ్ సీయూ భూముల వెనుక వేల కోట్ల బాగోతం రెండు రోజుల్లో చెబుతా అని బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి, కృష్ణా జలాల్లో విచ్చలవిడి దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. హెచ్‌సీయూ (HCU) భూముల విషయంలో తనకు దక్కనిది, ఎవరికీ దక్కకూడదని రేవంత్ రెడ్డి (REVANTHREDDY) ఆలోచిస్తున్నారని అన్నారు. కంచ గచ్చిబౌలి భూముల వెనుక బీజేపీ ఎంపీ (BJP MP) కూడా ఉన్నారు. భారీ భూకుంభకోణం బాగోతం మరో 2, 3 రోజుల్లో బయటపెడతానని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి ముఖ్యమంత్రి. దేశంలోని పవర్ ఫుల్ సీఎంల్లో రేవంత్ నంబర్ వన్‌గా ఉండాలి అని కేటీఆర్ అన్నారు. భూకంపం, భారీ వరదలు వచ్చినా మేడిగడ్డ చెక్కుచెదరలేదని వెల్లడించారు. కేసీఆర్‌పై కోపంతో నీళ్లు వదిలేయడం వల్ల పంటలు ఎండుతున్నాయని అన్నారు. ఆదిత్యనాథ్ దాస్‌ను సలహాదారుగా పెట్టుకున్నారని, ఆయన గతంలో ఏపీ తరఫున వాదించారని గుర్తు చేశారు. ఆదిత్యనాథ్ నియామకం ఏపీ ప్రయోజనాల కోసమా? తెలంగాణ కోసమా అని ప్రశ్నించారు. ఏపీ, చంద్రబాబు కోసమే ఆదిత్యనాథ్‌ను నియమించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే పంటలు ఎండుతున్నాయని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్లు అసాధ్యమనే కాంగ్రెస్ నేత రాహుల్ ఢిల్లీలో జరిగిన సభకు వెళ్లలేదని తెలిపారు.
అందుకే హైకమాండ్ జోక్యం
“ఏఐ వీడియోల పేరుతో తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందన్నారు. రాష్ట్రంలో నెగెటివ్ పాలసీలు, నెగెటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మాజీ సర్పంచ్ నుంచి మాజీ సీఎం వరకు కేసులెలా పెట్టాలని చూస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంలో మేం లేము. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసుల ఉపసంహరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కేసుల ఉపసంహరణ సరిపోదు.. జంతువధ కారకులపై కేసులు పెట్టాలి. సోషల్ మీడియాలో మాపై ఎదురుదాడి చేయడానికి భారీగా ఖర్చు చేసి టూల్ కిట్ సాయంతో ఎదురుదాడికి పాల్పడుతున్నారు. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతుల్లోనే ఉంటుంది. ఒకరు చెప్పులు మోస్తే.. ఇంకొకరు బ్యాగులను మోస్తున్నారు. 16, 17 నెలలైనా మంత్రివర్గాన్ని విస్తరించుకునే పరిస్థితి లేదు. ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా ఒక్క రూపాయి కూడా రాలేదు. మీనాక్షి నటరాజన్ (MINAKSHI NATARAJAN) సచివాలయంలో సమీక్షలు చేస్తున్నారు. రేవంత్ విఫల సీఎం కాబట్టే కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకుంటోందని” ఆరోపించారు.
…………………………………………………..