* లేబర్ పార్టీని వరించిన విజయం
ఆకేరు న్యూస్ డెస్క్ : బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్ (Rishi Sunak) నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ (Conservative Party) ఓటమి పాలైంది. కెయిర్ స్టార్మర్ (Keir Starmer) ఆధ్వర్యంలోని లేబర్ పార్టీ (Labour Party) విజయం సాధించింది. బ్రిటన్‌లోని స్థానిక కాలమానం ప్రకారం నిన్న రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది. ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. కాగా రిషి సునాక్ రిచ్మండ్ అండ్ నార్తలర్టన్ స్థానానికి తిరిగి ఎంపీగా ఎన్నికయ్యారు. లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నేడే అధికార మార్పిడి జరుగుతుందని రిషి సునాక్ తెలిపారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో లేబర్ పార్టీ 341 సీట్లకు పైగా విజయం సాధించింది. ప్రధాని అభ్యర్థి కీర్ స్టార్మర్ గెలుపొందారు. ఇక అధ్యక్షుడు రిషి సునాక్ పార్టీ 75 స్థానాలకే పరిమితమైంది. కాగా, ముందస్తు అంచనాలు లేబర్‌పార్టీ 410 స్థానాలు గెలుస్తుందని, కన్జర్వేటివ్ పార్టీ 131 సీట్లకే పరిమితమవుతుందని తెలిపాయి. 650 స్థానాలున్న బ్రిటన్ పార్లమెంటులో అధికారం చేపట్టడానికి 326 సీట్లు కావాల్సి ఉంటుంది.
ఓటమికి బాధ్యత వహిస్తున్నా.. క్షమించండి..
ఎన్నికల్లో ఓటమిపై రిషి సునాక్ స్పందించారు. ‘బ్రిటన్ ప్రజలు నిర్ణయాత్మకమైన తీర్పును ఇచ్చారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ నేత కెయిర్ స్టార్మర్‌కు అభినందనలు తెలియజేస్తున్నా. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుంది. అది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుంది. ప్రజల తీర్పును గౌరవిస్తూ.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా. ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు క్షమాపణలు కోరుతున్నా’ అని సునాక్ తెలిపారు.
————————————-