14 మంది దుర్మరణం.. 27 మందికి గాయాలు..
* చత్తీస్గఢ్, ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు..
* కోనసీమలో బర్త్ డే పార్టీ చేసుకుని వస్తుండగా విషాదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చత్తీస్గఢ్, ఏపీ రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలు ఏకంగా 14 మందిని పొట్టనబెట్టుకున్నాయి. మరో 27 మందికి గాయాలు అయ్యాయి. వారిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
* చత్తీస్గఢ్లో…
అతివేగం తొమ్మిది మంది ప్రాణాలను బలిగొంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. చత్తీస్గఢ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. బెమెతరా జిల్లాలో ఆగి ఉన్న లారీని మినీ వ్యాను ఢీకొట్టడంతో వ్యానులో ఉన్న తొమ్మిది మంది మరణించారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 23 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
* పుట్టినరోజు వేడుకలు చేసుకుని సంతోషంగా వస్తుండగా..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోనసీమ ప్రాంతంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల జతిన్ పుట్టినరోజు సందర్భంగా.. ఎనిమిది మంది యువకులు యానం వెళ్లారు.. ఆదివారం రాత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.. అర్ధరాత్రి వరకు యానాంలో ఫుల్లుగా మద్యం తాగారు. ఆ తర్వాత ఆటోలో సొంత ఊరికి బయల్దేరారు.. అయితే, రాత్రి 1.గంటల గంటల సమయంలో అమలాపురం మండలం భట్నవిల్లిలో లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పోలీసులు.. క్షతగాత్రుల్ని స్థానికుల సాయంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. యానాంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకొని పాశర్లపూడికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురిని కోనసీమ జిల్లా నగరం గ్రామ వాసులు, ఒకరిని పి.గన్నవరం మండలం మానేపల్లి వాసిగా గుర్తించారు. చనిపోయినవారిని సాపే నవీన్, కొల్లాబత్తుల జతిన్, నల్లి నవీన్ కుమార్, వల్లూరి అజయ్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
————————