* ఆర్జేడీ నేత సంచలన ప్రకటన
ఆకేరు న్యూస్, డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల హామీల్లో భాగంగా ఆర్జేడీ పార్టీ నేత, కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) సంచలన ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి ఏటా సంక్రాంతికి రూ.30 వేలు వాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. ‘మాయ్-బహిన్ మాన్ యోజనా’పేరిట ఈ పథకం తీసుకొస్తామని చెప్పారు. ఈ యోజన కింద, ప్రతి మహిళకు మకర సంక్రాంతి (జనవరి 14) నాడు రూ. 30,000 నగదు సహాయం అందజేయబడుతుందని తేజస్వి పేర్కొన్నారు. ‘మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, మకర సంక్రాంతి నాడు ఈ యోజనను అమలు చేస్తాం. ఇది బీహార్లోని ప్రతి తల్లి, సోదరి ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు సహాయపడుతుంది,’ అని చెప్పుకొచ్చారు. మొదటి నుంచీ మహిళలను ఆకర్షించేలా ప్రచారం చేస్తున్న తేజస్వీ.. తొలి దశప్రచారం చివరి రోజున చేసిన ఈ ప్రకటన ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బిహార్ ఎన్నికలు ఇండీ(India), ఎన్డీఏ (Nda) కూటముల మధ్య ప్రతిష్టాత్మకంగా మారింది. ఈనెల ఆరున, 11న రెండుదశలుగా పోలింగ్ జరిగే బిహార్ ఎన్నికల్లో 14న ఫలితాలొస్తాయి.
…………………………………
