ఆకేరు న్యూస్, డెస్క్:బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న హింసపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ గట్టిగా స్పందించారు. ముంబైలో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన, హిందువుల రక్షణ మరియు భారతదేశ పటిష్టతపై సంచలన వ్యాఖ్యలు చేశారు.బంగ్లాదేశ్‌లో ఇటీవల రాజకీయ సంక్షోభం తర్వాత హిందువులపై దాడులు పెరగడంపై భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. “బంగ్లాదేశ్‌లో సుమారు 1.25 కోట్ల మంది హిందువులు ఉన్నారు. వారు తమ ఉనికిని కాపాడుకోవడానికి, హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తారు” అని ఆయన స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న సోదరులకు అండగా ఉండటం ప్రతి హిందువు బాధ్యతని ఆయన గుర్తుచేశారు.దేశ అంతర్గత భద్రత మరియు జనాభా మార్పులపై కూడా భగవత్ కీలక విశ్లేషణ చేశారు. “నేటి భారతదేశం చాలా శక్తివంతమైనది. మనల్ని బలహీనపరచాలని చూసే వారే ముక్కలైపోతారు కానీ, భారత్‌ను ఎవరూ ఏమీ చేయలేరు” అని హెచ్చరించారు.గత ప్రభుత్వాలు జనాభా మార్పుల విషయంలో విఫలమయ్యాయని, అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ దిశగా సరైన నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన ప్రశంసించారు.సంఘ్ అంటే అధికారం కాదు,సేవ…ఆర్ఎస్ఎస్ పనితీరుపై వస్తున్న విమర్శలకు కూడా ఆయన ఈ వేదికగా సమాధానమిచ్చారు.”సంఘ్ ఏ రాజకీయ పార్టీని నడిపించే రిమోట్ కంట్రోల్ కాదు. మేము అధికారం కోసం పాకులాడటం లేదు. సమాజ హితం కోసమే స్వయంసేవకులు పనిచేస్తారు. సంఘ్ నడవడానికి అవసరమైన నిధులు కూడా స్వయంసేవకుల నుంచే వస్తాయి తప్ప బయటి శక్తుల నుంచి కాదు.” అని భగవత్ వివరించారు.అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ పదవికి కులంతో సంబంధం లేదని, అర్హత కలిగిన ఎవరైనా ఆ బాధ్యతలు చేపట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు.ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకుని ముంబైలోని నెహ్రూ సెంటర్లో జరిగిన ఈ రెండు రోజుల సదస్సు, హిందూ సమాజ ఐక్యత పట్ల ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. బంగ్లాదేశ్ హిందువులకు భరోసా ఇస్తూనే, దేశ సమగ్రత విషయంలో రాజీ లేదని భగవత్ చేసిన ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
