Sai Dharam Tej
Sai Dharam Tej| హైదరాబాద్: హీరో సాయి ధరమ్ తేజ్ తన జీవితంలో ఎదురైన రోడ్డు ప్రమాదానికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ఈ రోజును రీబర్త్ డేగా పేర్కొంటూ.. ప్రమాదం తర్వాత తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు, సినీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్ల క్రితం తనకు జీవితంలో రెండో అవకాశం లభించిందని సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నారు. అందుకు కుటుంబ సభ్యులు, అభిమానుల ప్రార్థనలు, ప్రేమ, మద్దతే కారణమని తెలిపారు. కష్టమైన సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.
90 శాతం కోలుకున్నా..
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తాను ప్రస్తుతం దాదాపు 90 శాతం వరకు కోలుకున్నానని సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు. ఇంకా మాటకు సంబంధించిన సమస్యతో పాటు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నానని తెలిపారు. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ పూర్తిగా కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఐదేళ్ల తర్వాత కూడా నేను నిలబడి ఉన్నాను. పోరాడుతున్నాను. జీవిస్తున్నాను అంటూ తన భావాలను పంచుకున్నారు. తన కోసం చేసిన ప్రతి ప్రార్థన, పంపిన ప్రతి శుభాకాంక్ష, సందేశం, చూపిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.
హెల్మెట్ ధరించండి
ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ రోడ్డు భద్రతపై కీలక సందేశం ఇచ్చారు. తన అనుభవం నుంచి ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని.. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం అనే చిన్న నిర్ణయం తనను ఈ రోజు అభిమానుల ముందుకు తీసుకొచ్చిందని పేర్కొన్నారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.

