ఆకేరు న్యూస్ , హనుమకొండ : రాష్ట్రంలోని అన్ని నగరాల్లో సంక్రాంతి సందడి కన్పిస్తోంది..ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో జనం కిటకిట లాడుతోంది. వృత్తి రీత్యా నగరాల్లో ఉండే వారు, చదువు కోసం పట్టణాల్లో ఉన్న విద్యార్థులు సంక్రాంతి కోసం పుట్టిల్లు బాట పట్టారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో అయితే మాత్రం సంక్రాంతి ఎఫెక్ట్ కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. హైదరాబాద్ లో స్థిర పడిన సీమాంధ్రులు పండగ కోసం ఏపీ బాట పట్టారు. హైదరాబాద్ లో సీమాంధ్రుల జనభా ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఆంధ్రాలో సంక్రాంతి పండగను చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు.. తెలంగాణలో దసరా పండగను గొప్పగా జరుపుకుంటే ఆంధ్రాలో సంక్రాంతి పండగను చాలా గొప్పగా జరుపుకుంటారు. హైదరాబాద్ లో రోడ్లన్నీ బోసిపోయినట్లుగా ఉంటే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మాత్రం కిక్కిరిసి పోతున్నాయి. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారి పరిస్థితి ఫరవాలేదు కాని రిజర్వేషన్ లేకుండా ప్రయాణిస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. డిచిన మూడు రోజుల్లోనే నగరం నుంచి సుమారు 30 లక్షల మందికి పైగా ప్రయాణికులు తమ స్వగ్రామాలకు తరలివెళ్లారు. గంటల కొద్దీ పిల్లాపాపలతో నిరాక్షిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రధాన నగరాలకు రవాణా సౌకర్యం ఉంది. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. అయినా పండగ వేళ సరిపోవడం లేదు దానికి తోడు ఇదే అదనుగా ప్రైవేట్ వాహనాల యజమానులు చార్జీలను విపరీతంగా పెంచారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల డిమాండ్ భారీగా పెరగడంతో రేపటి వరకు బస్సులు, రైళ్లలో అన్ని రిజర్వేషన్లు పూర్తిగా ఫుల్ అయ్యాయి. ఆన్లైన్, కౌంటర్ రిజర్వేషన్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నప్పటికీ, ప్రయాణికుల సంఖ్యకు అవి సరిపోవడం లేదు. రేపటి వరకు అన్ని ప్రధాన రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోయాయి.
………………………………….

