* హైదరాబాద్‌లో రైల్వేస్టేషన్లు, బస్టాప్‌లు హౌస్‌ఫుల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న వాహనాలతో ప్రధాన రహదారులు రద్దీగా మారాయి. ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే హైవేపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. నెమ్మదిగా కదులుతున్నాయి. చౌటుప్పల్, పతంగా టోల్ ప్లాజా, చిట్యాల వద్ద రద్దీగా ఎక్కువగా ఉంది. దీనికి తోడు హైవేపై కొన్నిచోట్ల రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడంతో ఆయా ప్రాంతాల్లో మరింత ట్రాఫిక్ జామ్ అవుతోంది. మరోవైపు హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మూట, ముళ్లు సర్దుకుని అందరూ పండగ కోసం సొంతూళ్లకు వెళ్తుండడంతో వారితో ఎక్కడ చూసినా రద్దీ కనిపిస్తోంది. ప్రధానంగా విజయవాడ, విశాఖపట్టణం, కాకినాడ వెళ్తున్న రైళ్లలో అయితే.. కాలు పెట్టేందుకు కూడా జాగా ఉండడం లేదని సాధారణ ప్రయాణికులు వాపోతున్నారు. రిజర్వేషన్లు అన్నీ రిగ్రెట్ చూపుతుండడంతో, ప్రత్యేక రైళ్లు కూడా సరిపోవడం లేదని పేర్కొంటున్నారు. ఒక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే సాధారణంగా రోజూ 1.50 లక్షల మంది వెళ్లే ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం 3 లక్షల పైచిలుకు వెళ్తున్నారని అధికారులు చెబుతున్నారు.
………………………………………………….

