* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: నవభారత నిర్మాణం కోసం నిరంతరం కృషి చేసిన మహా వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన అడుగుజాడలలో ప్రతి ఒక్కరు పయనించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్ వరంగల్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై సర్దార్ వల్లభాయ్‌పటేల్, భరతమాత చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించి, ఐక్యత పాదయాత్ర ను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భారత దేశంలో స్వేచ్ఛ కోసం తపించేవారని, ఎన్ని భాషలు మాట్లాడిన ఎన్ని ప్రాంతాలు ఉన్న మనమందరం ఒకటేనని చాటి చెప్పేవారని వివరించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సంస్థానాలుగా విడివిడిగా ఉన్న దేశాన్ని ఒక్కటి చేయడంలో సర్దార్ పటేల్ కృషి చేశారన్నారు. భారత దేశ ప్రజల్ని చైతన్యపరిచి ఏకతాటిపై నడిపించిన మహనీయుడని కొనియాడారు. ప్రజలు ఆయన ఆశయ సాధన కోసం పని చేయాలన్నారు. భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి ప్రతి పౌరుడు దేశీయ ఉత్పత్తులను ఉపయోగించుకోవాలని, దేశానికి సహకరించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిచే ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా మేరా యువభారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ మాట్లాడుతూ యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్ 2025″ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించబడే ఒక కార్యక్రమం అని అన్నారు. ఈ మార్చ్, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని జరుపుకుంటూ దేశ ఐక్యతను చాటి చెబుతుందని అన్నారు. ప్రతీ జిల్లా వ్యాప్తంగా యూనిటీ మార్చ్ నిర్వహించడం జరుగుతుందనీ దీనిలో భాగంగా ఈ రోజు ములుగు జిల్లా కేంద్రం లో నిర్వహించు కోవడం జరిగినదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేరా యువభారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్, డి వై ఎస్ ఓ సర్దార్ సింగ్, సూపరిండెంట్ బానోతు దేవిలాల్ మై భారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈసం నారాయణ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, నామినేటెడ్ సభ్యులు రమేష్ , హరీష్, మహిళా సంఘ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సుమారు 1000 మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………………
