పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో వింత పరిస్థితి
మూడు దేవాలయాలు, ఇంటికి రూ.వెయ్యి ఇచ్చేందుకు సిద్ధమైన అభ్యర్థి
తనని కాదని ఎవరైనా నామినేషన్ వేస్తే రూ.50లక్షలు జరిమానా
గ్రామస్తుల సమక్షంలో ఒప్పదంపత్రం.. వేడుకలు
ఆకేరున్యూస్, వరంగల్ : పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో వింత పరిస్థితి చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు. కానీ, ఆ గ్రామంలో మాత్రం సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవం చేసుకున్నారు. గ్రామానికి మూడు దేవాలయాలు, ఇంటికి రూ.వెయ్యి ఇచ్చేందుకు అభ్యర్థి సిద్ధమయ్యాడు. అంతేగాకుండా తనని కాదని ఎవరైనా నామినేషన్ వేస్తే రూ.50లక్షలు జరిమానాగా చెల్లించాలని గ్రామస్తుల సమక్షంలో ఒప్పదంపత్రం కూడా రాయించుకున్నాడు. అనంతరం గ్రామస్తులందరూ వేడుకలు చేసుకోవడం కొసమెరుపుగా మారింది.
తండాలో దాదాపు 883 మంది జనాభా, 700ల మంది ఓటర్లు ఉన్నారు. కాగా, తండాకు చెందిన ధరావత్ బాలాజీ తనను సర్పంచ్ గా ఏకగ్రీవం చేస్తే సొంత పైసలతో ఊరిలో బొడ్రాయి, పోచమ్మ తల్లి, ఆంజనేయుడికి కలిపి మూడు గుడులు కట్టి విగ్రహాలు పెట్టిస్తానని చెప్పాడు. అంతేగాకుండా బొడ్రాయి వేడుకల్లో ఖర్చుల కోసం ప్రతీ ఇంటికి రూ.వెయ్యి చొప్పున పంచుతానని తెలిపాడు. దీనికోసం తండాలో ఒక షరతు విధించాడు. తనను కాదని ఏవరైనా నామినేషన్ వేస్తే రూ.50లక్షలు జరిమానాగా చెల్లించాలని డిమాండ్ చేశాడు.
బాలాజీ షరతులకు అంగీకరించిన గ్రామస్తులు ఒకవేళ మాట తప్పితే ఎలా అన్ని ప్రశ్నించారు. దీంతో, ఎన్నికలు రాకముందే పనులన్నీ పూర్తి చేస్తానని ఆయన మాట ఇచ్చాడు. సోమవారం ప్రజలంతా సమావేశం ఏర్పాటు చేసుకొని ఒప్పందపత్రం రాసుకున్నారు. దీంతో పాటు పాటు బాలాజీ గ్రామస్తులందరితో సంతకాలు పెట్టించుకున్నాడు. అనంతరం సర్పంచ్ అభ్యర్థితో పాటు గ్రామస్తులంతా రంగులు చల్లుకుని సంబురాలు చేసుకున్నారు.
—————————