ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నాలుగు నెలలు తిరగకముందే.. తెలంగాణ లో మరో ఎన్నికల సమరం కొనసాగుతోంది. రాష్ట్రమంతటా పార్లమెంట్ ఎన్నికల వేడి రగులుతోంది. మరో ఆరు రోజుల్లోనే పోలింగ్ ముగియనుంది. దీంతో అన్ని పార్టీలూ ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. ప్రచారంలో జోరు పెంచాయి. మరోవైపు ఎన్నికల సంఘం ఓటింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. అధికారులను అప్రమత్తంగా చేస్తోంది. ఈ మేరకు ఓటర్లు కూడా మే 13న తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రమంతా ప్రజలందరూ ఎంపీలను ఎన్నుకోవడానికి సిద్దం అవుతుండగా, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీతో పాటు ఎమ్మెల్యేను కూడా ఎన్నుకోవాల్సి ఉంది. మల్కాజిగిరి లోక్సభ స్థానంలో భాగమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లు మే 13న రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి లోక్సభ ఎన్నికలకు, మరొకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో లోక్ సభ ఎన్నికలతో పాటుగా ఆ రోజున బై ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ బీఆర్ ఎస్ నుంచి లాస్య నందిత సోదరి నివేదిత, కాంగ్రెస్ నుంచి శ్రీగణేష్, బీజేపీ నుంచి వంశ తిలక్ పోటీలో ఉన్నారు.
——————————