* నరేంద్ర మోదిని నిలదీయండి
* విభజన హామీలను ఎందుకు అమలు చేయలేదు
* బీజేపీ కోసమే బీఆర్ ఎస్ డమ్మీ అభ్యర్థిని పెట్టింది
* వరంగల్ కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, వరంగల్ : రాష్ట్ర విభజన హామీలను అమలు చేయకుండా ఏ మొహం పెట్టుకుని వరంగల్ కు నరేంద్ర మోది వస్తున్నాడో నిలదీయండని ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి బీజేపీ , బీఆర్ ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పదేండ్ల కాలంలో నరేంద్ర మోది వరంగల్‌కు చేసిందేమి లేదు. వరంగల్ నగరం అబివృద్ధి చెందడానికి ఉపయోగపడే మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను ఎందుకు పునరుద్ధరించలేదు. విభజన ఒప్పందంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు పరిశ్రమ ను ఏర్పాటు చేయలేదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఏర్పాటు చేయలేదు. దక్షిణ భారత దేశంలో అతి ముఖ్యమైన కాజీపేట జంక్షన్ ను కూడా రద్దు చేసే పరిస్థితి వచ్చింది. అన్ని పరిశ్రమలు , అన్ని పథకాలు గుజరాత్‌కేనా..? తెలంగాణ పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నావని ప్రజలు నిలదీయాలన్నారు. ఇపుడు జరిగేవి కేవలం ఎన్నికలు మాత్రమే కావు.. ఇదీ యుద్ధం ..ఇపుడు గుజరాత్ వర్సెస్ తెలంగాణ .. ఢిల్లీ సుల్తానులను తరిమికొట్టిన కాకతీయ రాజుల ఓరుగల్లు పౌరుషాన్ని చూపించాల్సిన అవసరం వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు.
* కేసీఆర్ బుద్ది మారలేదు..
కారు రిపేర్‌కు పోయింది తొందరలోనే మళ్ళీ వస్తుందని కేటీఆర్ అంటున్నారు. మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు.. మెకానిక్ పెడ్డు నుంచి జుమెరాత్ బజార్లో తూకానికి వేయాల్సిందే తప్ప కారు తిరిగి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి లేనేలేదన్నారు. జుమెరాత్ బజార్లో తూకానికి వేయాల్సిందేనని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయం తెలిసే మీ తండ్రి కేసీఆర్ బస్సు లో తిరుగుతున్నాడన్నారు. పదేండ్లు పాలించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర విధ్వంసానికి పాల్పడ్డాడు. బస్సు ఏసుకుని బయులుదేరిన కేసీఆర్ పదేండ్ల కాలంలో చేసిన పొరపాట్లను ఒప్పుకుంటాడనుకున్నాను. ప్రజలకు క్షమాపణ చెప్పుతాడని భావించాను.ఇపుడైనా మారుతానని ప్రజలను ఓట్లడుగుతాడనుకున్నాను. ఎంత సేపు రేవంత్ రెడ్డి దిగాల్సిందే .. కాంగ్రెస్పడి పోవాల్సిందే నంటున్నాడన్నారు. ఎవరి పిల్లల్నో చంపి అధికారంలోకి రాలేదు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు చెమట ధార పోస్తేనే ఈ అధికారం వచ్చింది.. అధికారం నుంచి దిగడానికి అల్లాటప్పా వ్యక్తిని కాదు.. నేను వరంగల్ మిర్చి లాంటోన్ని అని తీవ్రం గా హెచ్చరించారు. పదేండ్లు కేసీఆర్ చేయలేని పనులు ఎన్నో చేశాను.. 30 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చానన్నారు. 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాను. 100 రోజుల్లో ఎన్నికల ముందు వాగ్ధానం చేసిన ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామన్నారు. పదేండ్లు తెలంగాణను మోది కాళ్ళ ముందు తాకట్టు పెట్టినందువల్లనే తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తాను. వరంగల్ నగరం చరిత్రలో నిలిచిపోయే విదంగా అభివృద్ధి చేస్తానని అని మాట ఇస్తున్నాను. ఎస్సీ కులాల వర్గీకరణ కోసం, ముదిరాజ్ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చే అంశాలు సుప్రీంకోర్టు లో ఉంది. ఇలాంటి అంశాల పరిష్కారానికి విద్యావంతురాలైన కడియం కావ్య సమర్థవంతంగా పనిచేస్తుందనే కడియం కావ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశామన్నారు.
* కొండా మురళీ కుటుంబంతో ఆత్మీయ అనుబందం
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండా మురళీధర్ రావు కుటుంబం నాకు అత్యంత సన్నిహితులు. అవకాశం వచ్చినప్పడు కొండా మురళీధర్ రావు కు రాజకీయంగా మంచి అవకాశం కల్పిస్తానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖకు వచ్చిన మెజారిటీకంటే ఒక్క ఓటు కూడా తగ్గకుండా చూసుకోవాలన్నారు.
* బీఆర్ ఎస్ అభ్యర్థి డమ్మీ అభ్యర్థి
బీఆర్ ఎస్ , బీజేపీ పార్టీలు అంతర్గత ఒప్పందంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయన్నారు. బీఆర్ ఎస్ పార్టీ కి చెందిన ఆరూరి రమేశ్‌ను బీజేపీలోకి బీఆర్ ఎస్ పార్టీ నేతలే పంపించారన్నారు. బీఆర్ ఎస్ అభ్యర్థిగా ఒక డమ్మి అభ్యర్థిని నిలబెట్టారు. ఇదీ బీజేపీ – బీఆర్ ఎస్‌లో ఒప్పందంలో భాగమేనన్నారు.
బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ పేదల భూములు లాక్కున్న అనకొండ .. నీతి బోధలు చేసే నరేంద్రమోది ఆరూరి రమేశ్ లాంటి భూ కబ్జా దారులను ఏవిదంగా ఎంపిక చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రలు కొండా సురేఖ, మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు లతో పాటు కొండా మురళీధర్ రావు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు..
———————————————–