మంత్రి సీతక్క
* మంత్రి సీతక్క
* విద్యార్థులు వ్యక్తిగత భద్రతపై అవగాహన పెంచుకోవాలి
ఆకేరు న్యూస్, ములుగు: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది విద్యేనని, విద్యార్థులు ఆసక్తితో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. చదువుతోపాటు వ్యక్తిగత భద్రతపై కూడా ప్రతి విద్యార్థి అవగాహన పెంచుకోవాలని సూచించారు.
గురువారం ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గోవిందరావుపేట మండలం పసర జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’లో భాగంగా నిర్వహించిన విద్యార్థుల అవగాహన కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీవితంలోని ప్రతి దశలో విద్య, జ్ఞానం మనకు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ, తాము సంపాదించిన జ్ఞానాన్ని పదిమందికి పంచాలని సూచించారు. విద్యతోనే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని తెలిపారు.
పాఠశాలల్లో ఉన్నప్పుడు, బస్సులు, ఆటోల్లో ప్రయాణించేటప్పుడు ఎదురయ్యే వివిధ రకాల వేధింపులను గుర్తించేలా విద్యార్థులు వ్యక్తిగత భద్రతపై అవగాహన పెంచుకోవాలని మంత్రి సూచించారు. చదువుతోపాటు తమను తాము రక్షించుకునేందుకు అవసరమైన అంశాలను కూడా తెలుసుకోవాలని కోరారు.
బాలల రక్షణ చట్టాలపై అవగాహన
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పోక్సో చట్టం, సైబర్ నేరాలు, బాలల అక్రమ రవాణా నివారణతోపాటు బాలల రక్షణకు సంబంధించిన వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. మాట్లాడే బొమ్మ ద్వారా ‘గుడ్ టచ్–బ్యాడ్ టచ్’ గురించి వివరించి, పిల్లలు తమ వ్యక్తిగత భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, స్థానిక సర్పంచ్ సుమలత, పసర జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

