ఆకేరున్యూస్, హనుమకొండ: నిబంధనలకు విరుద్ధంగా రోగులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన ఫిజీషియన్ శాంపిల్స్ మందులను అక్రమంగా అమ్ముతున్న మెడికల్ షాపును సీజ్ చేసి మందులను హనుమకొండ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. వివరాల ప్రకారం.. హన్మకొండ మండలం వేలేరు మండల కేంద్రంలోని క్రాంతి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ పైన హనుమకొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ జన్ను కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో క్రాంతి మెడికల్ స్టోర్‌లో అక్రమంగా నిల్వ ఉంచి అమ్ముతున్న రూ.లక్ష రూపాయల విలువగల ఫిజీషియన్ శాంపిల్స్ మందులను స్వాధీనపరుచుకున్నారు.
రోగులకు ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది వీటిని అమ్మడం నిబంధన ప్రకారం నిషేధం ఉంది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ కమలూ హసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించి 65 రకాల ఈ ఫిజిషన్స్ శాంపిల్స్‌తో పాటు మరికొన్ని కాలం చెల్లిన మందులను సైతం స్వాధీనపరుచుకున్నట్లు హన్మకొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ జన్ను కిరణ్ కుమార్ తెలిపారు. సంబంధిత మెడికల్ షాప్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తెలిపారు. హనుమకొండ పట్టణంలోనూ పలు ఆస్పత్రుల్లోని మెడికల్ షాపుల్లో ఈ రకంగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అమ్మకాలు కొనసాగుతున్నాయని వాటిపైన డ్రగ్ కంట్రోల్ అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
……………………………..