* బండి సంజయ్‌పై కడియం శ్రీహరి ఫైర్..
* బీజేపి, బీఆర్ఎస్ పార్టీలు నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నాయి
* ఒకరిని మించి మరొకరు విమర్శల్లో పోటీ పడుతున్నారు
* రేవంత్ రెడ్డి సంకల్పానికి ప్రతిఒక్కరూ అండగా నిలబడాలి.
* ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరున్యూస్, జనగామ: బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి అనే విషయం మర్చిపోయి రోడ్డుపై కూర్చొని ధర్నా చేయడానికి సిగ్గుండాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(KADIYAM SRIHARI), వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య(KADIYAM KAVYA) ముఖ్య అతిథిగా హాజరై జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, వైస్ చైర్మన్ కొల్లూరి నరసింహులు మార్కెట్ డైరెక్టర్లను ఘనంగా సన్మానించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి (KADIYAM SRIHARI) మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి కనీసం 2 వేల ఉద్యోగాలు కూడా ప్రకటించలేదన్నారు. బీజేపీ నాయకులు ఒకరు హైడ్రాను సమర్ధిస్తే, మరొకరు విమర్శిస్తున్నారని.. ఒకరు మూసి ప్రక్షాళన చేయాలంటూ మరొకరు వద్దంటూ మాట్లాడడం వారిలో వారికే క్లారిటీ లేదని హెద్దేవా చేశారు. ఏ ఒక్క ప్రాజెక్టును తెలంగాణకు తీసుకురాలేని నాయకులు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని.. రేవంత్ రెడ్డి సంకల్పనికి తోడుగా నిలబడాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని తెలంగాణ ప్రజలకు సూచించారు.
జనగామ జిల్లాకు దేవాదుల ప్రాజెక్టు వరప్రదాయిని..
జనగామ జిల్లాకు దేవాదుల ప్రాజెక్టు వరప్రదాయిని అని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి స్పష్టం చేసారు. దేవాదుల ప్రాజెక్టుతో జనగామ జిల్లా రూపు రేఖలు మార్చిందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక ధాన్యం దిగుబడి జనగామ జిల్లాలోనే జరుగుతుందని.. అది దేవాదుల ప్రాజెక్టు వల్లే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి, జనగామ జిల్లా అభివృద్ధికి నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. గత పాలనలో అభివృద్ధిని పక్కన పెట్టి కమిషన్లకు కక్కుర్తి పడ్డారని విమర్శించారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతిపక్షాలపై ఫైర్..
బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు అమాయకులైన విద్యార్థులను, నిరుద్యోగులను అడ్డుపెట్టుకుని అనవసరమైన ఆందోళనలు చేస్తూ వారిని పెడదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ, బీఆర్ఎస్ ముప్పేట దాడి చేయడం సరికాదన్నారు. 10 ఏండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్లో హరీష్‌రావు, కేటీఆర్ మధ్యలో పోటీ ఏర్పడిరదన్నారు. పేపర్లలో, టివి ఛానల్లో పోటీపడీ మరి పెయిడ్ ఆర్టికల్స్ రాయించుకుంటున్నారన్నారు. ఒకరిని చూసి ఒకరు ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకున్నారని.. 2014లో కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎన్ని…. ఈ రోజు మీ ఆస్తులు ఎన్నో బయటపెట్టాలని.. మీరు నిజాయితీపరులు అయితే…. తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే వెంటనే ఆస్తుల వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేసారు.
రూపాయలు 5కే మధ్యాహ్న భోజనం అందించాలి..
రైతులకు మార్కెట్ నిధుల నుండి రూపాయలు 5కే మధ్యాహ్న భోజనం అందించాలని ఎమ్మెల్యే అన్నారు. రైతులకు విశ్రాంతి భవనం, ఇంటర్నల్ సిసి రోడ్ ఏర్పాటు చేయాలని కోరారు. మార్కెట్ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
రైతులకు అండగా నిలబడి మెరుగైన సేవలు అందించాలి :
వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య
నూతన పాలక మండలికి వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన వ్యవసాయ మార్కెట్ కమిటీ జనగాం పాలకమండలి రైతులకు అండగా నిలబడి మెరుగైన సేవలు అందించాలన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఈ మార్కెట్లో రైతులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, మార్కెట్‌ను అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రైతులకు అండగా నిలుస్తుందన్నారు. రైతులను రుణ విముక్తిని చేయాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. భారతదేశంలో మొదటిసారిగా 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ఇప్పటికే 23 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందని పేర్కొన్నారు. డిసెంబర్ 9 2024 వరకు సోనియాగాంధీ పుట్టినరోజు వరకు మొత్తం 42 లక్షల మంది రైతులకు 31 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేయాలని ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండాను బలంగా పాతే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రతిపక్షలకు కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది…చేసేదే చెప్తుందని అన్నారు. జనగామ మార్కెట్ పెద్దదని, మార్కెట్ కమిటీపై బాధ్యతలు కూడా పెద్దగానే ఉంటాయన్నారు. మార్కెట్ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎంపీ డా. కడియం కావ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………………..