* రైలును ఆపి దోచుకోవడంలో ఆరితేరిన సిక్కా గ్యాంగ్
* వైరల్‌గా మారిన వీడియో
* ఆ పరిజ్ఞానం దొంగలకు ఎలా?
రైలులో కిటికీలు, డోర్ వద్ద ఉన్నవారి నుంచి ఫోన్లు, నగలు దోచుకెళ్తున్న ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. కానీ.. ట్రాక్‌పై రూపాయి కాయిన్ పెట్టి రైలు ఆగేలా చేసి దొంగతనాలు చేయడం వారి ప్రత్యేకత. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? అయితే ఈ కథ చదవాల్సిందే.
ఆకేరు న్యూస్ డెస్క్: ఇంటికి దగ్గర్లో రైల్వే ట్రాక్ (Railway Track) ఉన్న చాలా మందికి ఓ అనుభవం, జ్ఞాపకం ఉండే ఉంటుంది. రైలు పట్టాల (Train Tracks)పై నాణెం పెట్టేవారు. అలా కాయిన్ పెట్టడం వల్ల అది అయస్కాంతం (Magnet) లా మారుతుందని పిల్లలు భావించేవారు. రైలు బరువుకు పెద్దగా మారిన నాణేన్ని చూసి మురిసిపోయేవారు. కాలం మారేకొద్దీ అలాంటి పనుల వల్ల ప్రమాదాలకూ ఆస్కారం ఉందని ప్రచారం జరగడంతో ఇప్పుడు ఆ తరహా పనులు లేవు. అప్పుడప్పుడు కొందరు ఆకతాయిలు వీడియోల కోసం చేస్తున్నారు. అయితే.. ఈ దొంగల కథ వారి అందరికీ భిన్నం.
పక్కా ప్లాన్ తో రైలు ఆగేలా చేసి..
హరియాణా( Haryana) కు చెందిన సిక్కా (కాయిన్) గ్యాంగ్ (Sikka Gang).. రైలును ప్రణాళికాపరంగా నిలిపి ప్రయాణికులను దోచుకోవడంలో ఆరితేరింది. అంతగా భద్రత లేని రైలు(Train)ను గుర్తించి, అనువైన ప్రదేశంలో ఆ రైలు (Train)ను ఆగేలా చేస్తారు. అందుకు వారు ఏం చేస్తారంటే.. రైలు ట్రాక్‌పై అక్కడక్కడా గ్యాప్ ఉండే చిన్న ప్రదేశంలో కాయిన్(Coin) పెడతారు. మండు వేసవిలో రైలు వేగానికి ఎండకు పట్టాలు వ్యాకోచించే అవకాశం ఉన్న నేపథ్యంలో పట్టాలపై ఆ గ్యాప్ ఉంచుతారు. అయితే.. ఆ గ్యాప్‌లో కాయిన్ పెట్టడం వల్ల గ్రీన్ సిగ్నల్ (Green Signal) కాస్త రెడ్ సిగ్నల్ (Red Signal) గా మారుతుందట. ప్రమాదాల నివారణకు పట్టాల మెకానిజాన్ని సాంకేతిక నిపుణులు అలా రూపొందించారు. సిక్కా గ్యాంగ్ (Sikka Gang) ఆ టెక్నాలజీని తమకు అనువుగా మార్చుకుంటోంది. ట్రాక్ పై రూపాయి పెట్టి రైలు ఆగేలా చేసి.. ప్రయాణికులను దోచుకుంటోంది. కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లా (Nellore District) లో జరిగిన రైలు దోపిడీ సిక్కా గ్యాంగ్ పనేనని పోలీసు(Police) లు అనుమానిస్తున్నారు. ఓ పోలీసు అధికారి సిక్కా గ్యాంగ్ దోపిడీ తీరును వివరిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. రైలును ఆపే పరిజ్ఞానం ఆ దొంగలు ఎలా తెలుసుకున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలాఉండగా, సురక్షితమైన ప్రయాణానికి ఉత్తమ మార్గంగా రైలును ఎంచుకునే ప్రయాణికులను ఇలాంటి దోపిడీలు, ప్రమాదాలు ఇప్పుడు కలవరానికి గురి చేస్తున్నాయి.
—————————