* మెసేజింగ్ యాప్‌లకు SIM లింక్ తప్పనిసరి?
* కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై టెక్ రంగంలో చర్చ
దేశంలో వినియోగంలో ఉన్న మెసేజింగ్ యాప్‌ల సేవలను యూజర్ మొబైల్ SIM కార్డ్‌తో అనుసంధానం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం టెక్నాలజీ రంగంలో చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం ప్రకారం, వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లు భవిష్యత్తులో యూజర్ డివైస్‌లో యాక్టివ్ SIM కార్డ్ ఉన్నప్పుడే పనిచేసే విధంగా మార్పులు రావచ్చు.
టెలికమ్యూనికేషన్ శాఖ (DoT) 2025లో తీసుకొచ్చిన టెలికాం సైబర్ సెక్యూరిటీ సవరణ నిబంధనల భాగంగా ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. మొబైల్ నంబర్‌ను గుర్తింపుగా ఉపయోగించే యాప్‌లు, ఫోన్లో SIM లేకపోయినా సేవలు అందిస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ విధానం విదేశాల నుంచి జరిగే సైబర్ మోసాలకు దోహదపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో టెలికాం ఎకోసిస్టమ్ భద్రతను కాపాడేందుకు యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలను యాక్టివ్ SIMతో అనుసంధానం చేయడం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పు అమల్లోకి వస్తే, యూజర్లు తమ ఫోన్లో SIM యాక్టివ్‌గా ఉన్నప్పుడే మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించగలరు.
ఈ నిబంధనలు అమలులోకి వస్తే వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, జోష్ వంటి పలు డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగ విధానంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
ఇక డిజిటల్ మోసాలను అరికట్టడం, టెలికాం గుర్తింపుల దుర్వినియోగాన్ని తగ్గించడం, సైబర్ భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు టెలికాం శాఖ తెలిపింది.
డిజిటల్ సేవలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, వినియోగదారుల గుర్తింపు మరియు భద్రతకు సంబంధించిన నియమాలను మరింత కట్టుదిట్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
