SIR Protest
* ఇందిరాపార్కు వద్ద భారీ నిరసన ప్రదర్శన
ఆకేరు న్యూస్, నెట్వర్క్ : ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో చేపట్టిన ఓట్ల తొలగింపును నిరసిస్తూ దిశా విద్యార్థి సంఘం, నవజవాన్ భారత్ సభ, మజ్దూర్ బిగుల్ తదితర సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
భగత్ జనఅధికార యాత్ర క్యాంపైన్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిశా విద్యార్థి సంఘం నాయకులు ఇబ్రహీం, మహిపాల్, శ్రీజ, సుహాస్, న్యాయవాది ధరణి కృష్ణ మాట్లాడుతూ… ఎస్ఐఆర్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన శాంతియుత ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా అణచివేసిందని తీవ్రంగా మండిపడ్డారు.
* ప్రజల ప్రాథమిక హక్కుల హరింపు
ఢిల్లీలోని జంతర్‌మంతర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు యాభై మెట్రోస్టేషన్లను మూసివేసి, వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వెళ్లే 245 పైగా రైళ్లను రద్దు చేసి, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి రవాణా సమాచార వ్యవస్థను స్తంభింపజేయడం ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులను హరించారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని, ఎస్ఐఆర్ ద్వారా ఎన్నికల సంఘాన్ని తమ రాజకీయ ఆయుధంగా మలచుకున్నారని విమర్శించారు.
* సర్ పై దేశ వ్యాప్త ఉద్యమం
ఈ క్రమంలోనే కేంద్రం తన విధానాలను మార్చుకోకపోతే రానున్న రోజుల్లో కేవలం ఢిల్లీకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.
బీజేపీ-ఆర్ఎస్ఎస్ల కనుసన్నల్లో పనిచేస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, ఆయనపై వెంటనే విచారణ జరిపి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో భార్గవి, రాజు, ఫేబియన్ తదితరులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

