
– మహా అన్న ప్రసాద వితరణలు
– నృత్య ప్రదర్శనలు, కోలాటాలు,భజనలు
ఆకేరు న్యూస్ కమలాపూర్: కమలాపూర్ మండలంలో గణేష్ మండపాల వద్ద ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. కమలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ సూచనలు, జాగ్రత్తలతో గ్రామాలలో నిర్వాహకులు గణేషుడి మండపాలను ఏర్పాటు చేసుకున్నారు.మండల వ్యాప్తంగా వివిధ రూపాలలోని గణేశుడి ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు నుంచి భక్తులు భక్తిశ్రద్ధలతో ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రెండవ రోజు నుంచి మండలంలోని పలు గణేష్ మండపాల వద్ద మహా అన్న ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం భజన,కోలాటాలు ఆడుతూ నృత్య ప్రదర్శనలు చేస్తున్నారు.
అలరించిన కూచిపూడి నాట్య ప్రదర్శన
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఉప్పల్లో పంచశిఖ ఆర్ట్స్ హైదరాబాద్, సుమలత ఆధ్వర్యంలో ఆమె శిష్యులు చంద్రవదన,లహరి,నిహారిక గజానన భక్తమండలి గణేశుడి వద్ద కూచిపూడి నాట్య ప్రదర్శన ఇచ్చారు. ఓం శివోహం అనే నృత్య రూపకం ఆకట్టుకుంది. నృత్య ప్రదర్శన అనంతరం నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి గ్రామ ప్రజలు విశేషంగా హాజరై కూచిపూడి నృత్య ప్రదర్శన వీక్షించారు. నవరాత్రిలో భాగంగా ఐదు రోజులు పూర్తికావస్తుండగా 7వ తేదీన చంద్రగ్రహణం ఉండడంతో పదవరోజు రాత్రి వరకు నిమజ్జనం చేయడానికి నిర్వాహకులు సమాయత్తం అవుతున్నారు.
………………………………….