* శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టు(Shamshabad Airport)లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. వారు వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిపోయింది. అయితే విమానం నిలిచిపోయిన విషయాన్ని ప్రయాణికులకు చెప్పడంతో ఎయిర్పోర్టు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. విమానం నిలిచిపోయిందని సమాచారం ఇవ్వడంలో ఎయిర్పోర్టు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అప్పటి వరకు విమానం కోసం వేచి చూస్తున్న ప్రయాణికులకు చివరి నిమిషంలో అక్కడి సిబ్బంది చెప్పిన కారణంతో వారు మండిపడిపోతున్నారు. హైదరాబాద్- తిరుపతి (Hyderabad-Tirupathi)విమానం ఈరోజు ఉదయం 5:30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఇందులో ప్రయాణించేందుకు ప్రయాణికులు అప్పటికే విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే చివరి నిమిషంలో విమానాన్ని నిలిపివేసినట్లు ఎయిర్పోర్టు సిబ్బంది ప్రకటించారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి విమానం కోసం నిరీక్షిస్తుంటే చివరి నిమిషంలో ఎయిర్పోర్టు సిబ్బంది ఇలా చెప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. దాదాపు నాలుగు గంటలుగా ఎయిర్పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి. మొత్తం 47 మంది ఈ విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సి ఉంది.
……………………………………………..