Fertilizer Price Hike Telangana Farmers
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
భారీగా పెరిగిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధి చాగల్లు లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు అది సాయన్న అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ పాల్గొని మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల గణనీయంగా ఎరువుల ధరలు పెరిగి రైతులకు భూమి నుండి దూరం చేసే కుట్ర మోడీ ప్రభుత్వం చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టేందుకు రైతులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో రైతుల పరిస్థితి గడ్డుకాలంగా మరే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలను ఎత్తేసే కుట్రలు పన్నుతుందన్నారు. చిన్న సన్నకారు రైతులకు కన్నీళ్ళు తప్ప మరొకటి లేదన్నారు. ఇప్పటిదాకా వడ్లు కొనుగోలు కేంద్రాల్లో ఉండటం శోచనీయం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తున్న రైతు సంఘం జూన్ 22న దేశ వ్యాప్తంగా పెరుగిన ఎరువుల క్రిమిసంహారక మందుల ధరలపై ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి రాజయ్య, జిల్లా కార్యదర్శి చొప్పరి సోమయ్య, గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి జువారి రమేష్, తోట రమేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ యూనిస్, మండల అధ్యక్షులు యాకుబ్ పాషా, కార్యదర్శి పెండ్యాల సమ్మాయ్య, బోనగిరి కుమారస్వామి, బుర్ల యాదగిరి, ముసలయ్య, కలకోటి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
