Stock Market Crash
* 100 డాలర్లకు ముడిచమురు..
* భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా భారీ నష్టాలతో పతనాన్ని చవిచూస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాలు, ముఖ్యంగా ముడిచమురు ధరలు మళ్లీ భయపెడుతుండటంతో భారతీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. మదుపరులు పెద్దఎత్తున అమ్మకాలకు మొగ్గు చూపడంతో సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి.
* భారీగా పడిపోయిన సూచీలు..
ట్రేడింగ్ ప్రారంభం నుంచే మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1,180 పాయింట్లకు పైగా నష్టపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సుమారు 370 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. మార్కెట్ ఒక్కసారిగా పడిపోవడంతో మదుపరుల సంపద భారీగా ఆవిరైంది.
* మార్కెట్లపై తీవ్ర ప్రభావం..
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు (Crude Oil) ధర మళ్లీ గరిష్ట స్థాయికి చేరింది. క్రూడాయిల్ ధర ఏకంగా 100 డాలర్ల మైలురాయిని తాకడం మార్కెట్ వర్గాలను కలవరపెడుతోంది. భారత్ తన పెట్రోలియం అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుండటంతో.. చమురు ధరలు పెరిగితే దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు వెల్లువెత్తుతున్నాయి.
అంతర్జాతీయంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు క్రూడ్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో విదేశీ సంస్థాగత మదుపరులు (FIIs) తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటూ భారీగా షేర్లను విక్రయిస్తుండటం మార్కెట్ల పతనానికి మరో ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలు శాంతించే వరకు మార్కెట్లలో ఈ ఒడుదొడుకులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
