* ముప్పు గ్రహించలేని పసిప్రాణం
* నివారణ చర్యలు అంతంతమాత్రమే
* జంతు ప్రేమికుల వైఖరి మరో రకంగా..
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
హయత్ నగర్ లో వీధి కుక్క దాడి ఘటన తీవ్ర సంచలనంగా మారింది. అంతకు మించిన విషాదాన్ని నింపింది. శివగంగ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేండ్ల బాలుడిపై వీధి కుక్కలు తెగబడ్డాయి. పాపం ఆ బాలుడు మూగవాడు. సుమారు పదికి పైగా కుక్కలు ఎగబడటంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. శునకాల దాడిలో అతని చెవి ఊడిపోవడంతోపాటు తల, నడుము, వీపు భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి. నిలోఫర్ ఆస్పత్రి అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. నగరంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు దాడికి పాల్పడుతున్నాయి.
హయత్‌నగర్ ఘటన మరువక ముందే హైదరాబాద్ యూసుఫ్‌గూడ పరిధిలోని శ్రీలక్ష్మీనరసింహనగర్లో మరో బాలుడిపై వీధి కుక్కలు దాడికి యత్నించాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న మాన్వీత్ నందన్ అనే రెండేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడికి దిగింది. చిన్నారి చేతిని కరిచే ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న బాలుడి తాత అప్రమత్తమై కర్రతో కొట్టడంతో వీధికుక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం గాయాలపాలైన బాలుడిని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హయత్‌నగర్ ఘటన జరిగిన మూడు రోజుల్లోనే యూసుఫ్‌గూడలో మరో చిన్నారిపై కుక్క దాడికి యత్నించడం కలకలం రేపింది.
ఏటా సగటున రూ.10 కోట్లు ఖర్చు
చిన్నారులపై వీధి కుక్కల దాడి ఘటనలు ఇవే కాదు. గతంలోనూ చాలా ఘోరాలు జరిగాయి. సీరియస్ ఘటనలు చోటుచేసుకున్నాయి. అలాంటివి జరిగినప్పుడే అధికారులు హడావిడి చేస్తున్నారు. వీధి కుక్కల నివారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటిని పట్టుకుని సర్జరీలు చేసి మళ్లీ అక్కడే వదిలేస్తున్నారు. జీహెచ్ ఎంసీ పరిధిలో కుక్కుల నియంత్రణకు ఏటా సగటున రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కానీ కుక్కల సంతానం పెరగకుండా శస్త్రచికిత్సలు చేసినా అవి పెరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకు నగరంలో కుక్క కాటు కేసులు పెరుగుతున్నాయి. ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడలోని ఐపీఎంలో నిత్యం పదుల సంఖ్యలో కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. వాస్తవంగా వేసవిలో కుక్కలు విపరీతంగా ప్రవర్తిస్తాయి. ఆ సీజన్లోనే ఎక్కువ కుక్క కాటు కేసులు నమోదవుతాయి. అందుకు భిన్నంగా శీతాకాలంలోనూ కేసుల సంఖ్య పెరుగుతుండడం తాజాగా కలచివేస్తోంది.
జంతు ప్రేమికుల వైఖరి మరో రకంగా..
వీధికుక్కల విజృంభణపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో వీధి కుక్కల దాడులు జరుగుతున్నా, ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సామాన్య పౌరులు మండిపడుతున్నారు. తమ పిల్లల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. జంతు ప్రేమికుల వైఖరి మరో రకంగా ఉంది. వీధి కుక్కులన్నీ కరిచేవి కాదని అంటున్నారు. దత్తత కార్యక్రమాలను మరింతగా పెంచి వీధి శునకాల దత్తతపై ప్రచారం చేయాలని సూచిస్తున్నారు. వాటిని బంధించి, కొన్ని రోజుల తర్వాత మళ్లీ వదిలేస్తుండడంతో అవి గతి తప్పుతున్నాయని అంటున్నారు. ఉన్నచోటే వాటికి ఆహార ఏర్పాట్లు చేస్తే దాడులకు పాల్పడే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు.
………………………………………

