* మేడ్చల్ నారపల్లిలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం
* ప్రాణాలు పోయినా ఫరవాలేదు.. అవే వికృత చేష్టలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఉన్నత విద్య చదివి తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్న ఆశలను ఆవిరి చేసి తనువు చాలించాడు ఆ విద్యార్థి..సీనియర్ల దుర్మార్గానికి, సీనియర్ల వికృతచేష్టలకు తన జీవితాన్ని బలిచేసుకన్నాడు. ఈ హృదయ విదారకర ఘటన మేడ్చెల్ పరిధిలోని నారపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన జాదవ్ సాయితేజ (19) నారపల్లిలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నారు.ఇటీవల కొంతమంది సీనియర్లు ర్యాగింగ్ పేరుతో సాయితేజను బార్ షాప్ తీసుకెళ్లి మద్యం తాగించారు. అంతే కాకుండా మద్యం తాలూకూ బిల్లు పదివేల రూపాయలు కట్టాలని సాయితేజను బెదిరించారు. దీంతో మనస్థాపానికి గురైన సాయితేజ ఆదివారం రాత్రి హాస్టల్ గదిలో ఉరేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చనిపోయే ముందు సెల్పీ వీడియో..
చనిపోయే ముందు తల్లిదండ్రులకు ఓ సెల్ఫీ వీడియోను వాట్సప్ ద్వారా పంపించాడు. ఆ వీడియోలో తనను క్షమించండని తల్లిదండ్రులను కోరాడు. ఈ సంగతి తెలియగానే తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శోక సముద్రంలో కుటుంబం
ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నత చదువు చదువుతున్న తమ కుమారుడు ఇలా హఠాత్తుగా తనువు చాలించడంతో ఆ తల్లిదండ్రులు హృదయవిదారకంగా రోధిస్తున్నారు. ఉట్నూరులో డీఎంఎల్టీగా పనిచేస్తున్న జాదవ్ ప్రేమ్ సింగ్ తన కుమారుడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఇంటర్ వరకు సాయితేజను ప్రైవేట్ కళాశాలలోనే చదివించాడు. కుమారుడికి ఇంజినీరింగ్ లో సీటు రావడంతో మేడ్చెల్ పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చేర్పించారు. ఇంత లోనే విధి వక్రించింది. ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి, సీనియర్ల రాక్షసత్వానికి సాయితేజ బలిఅయ్యాడు.
ఆత్మహత్య కాదు హత్యే,,
సాయితేజది ఆత్మహత్య కాదని హత్యే అని సాయితేజ తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు.
తమ కుమారుడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని సాయితేజ తండ్రి ప్రేమ్ సింగ్ ఆరోపిస్తున్నారు. సాయితేజ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని బంధువులు చెబుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తల్లిడండ్రలు ఫిర్యాదు మేరకు పోలీసులు సాయితేజ మరణానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
ర్యాగింగ్ మరణాలు
భారతదేశంలో 2020 నుండి 2024 మధ్య కాలంలో ర్యాగింగ్ కారణంగా 51 మంది విద్యార్థులు మరణించారని సొసైటీ ఎగైనెస్ట్ వయలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ (సేవ్) నివేదిక తెలిపింది. ఈ మరణాల్లో ఎక్కువ భాగం వైద్య కళాశాలల్లోనే నమోదయ్యాయని, ఫిర్యాదుల్లో 38.6% వైద్య కళాశాలల నుంచే వచ్చాయని నివేదిక పేర్కొంది.
ర్యాగింగ్ ని ఎలా నిరోధించాలి
దేశంలో నేడు అనేక విద్యాసంస్థల్లో ర్యాగింగ్ సంస్కృతి ఎక్కవైంది. నేటి విద్యార్థులకు ఇదో ఫ్యాషన్ గా మారింది దురదృష్టం ఏంటంటే ర్యాగింగ్‌ను ఇప్పడు ఓ ట్రెడిషన్ గా మారింది.ర్యాగింగ్ ను నిరోధించడానికి భారత ప్రభుత్వం 2009లో 2011లో చట్టాలను రూపొందించింది.ఆ చట్టాల ప్రకారం ర్యాగింగ్ పాల్పడిన వారికి రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధిస్తారు.ఏదైనా విద్యాసంస్థ లోపల లేదా వెలుపల ర్యాగింగ్‌కు పాల్పడిన లేదా ప్రోత్సహించిన ఎవరైనా ఈ చట్టం ప్రకారం శిక్షించబడతారు. దీనిపై విద్యార్థుల్లో విద్యార్థుల తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ర్యాగింగ్ కు పాల్పడిన వారిపై ఆయా కళాశాలల యాజమాన్యాలు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి విద్యార్థులను సస్పెండ్ చేసే అధికారం కళాశాల నుంచి బహిష్కరించే అధికారం ఆయా కళాశాలల యాజమాన్యాలకు ఉంటుందని చట్టంలో పొందుపరిచారు.
అఫిడవిట్లు సమర్పించాలి
తమ పిల్లలను కళాశాలలో చేర్పించే ముందు విద్యార్థుల తల్లిదండ్రులు యాంటీ ర్యాగింగ్ అఫిడవిట్ ను తప్పనిసరిగా సమర్పించాలి .ఈ అఫిడవిట్ అనేది చట్టబద్ధంగా కట్టుబడి ఉండే పత్రం, ఇది నేరస్థులను కోర్టు ధిక్కారానికి గురి చేస్తుంది, ఇతర జరిమానాలతో పాటు, బలమైన నిరోధకంగా పనిచేస్తుంది ఈ ప్రక్రియ విద్యార్థులు ,తల్లిదండ్రులు ఇద్దరూ ర్యాగింగ్ వల్ల జరిగే దుష్పరిణామాలపై అవగాహన కలుగుతుంది. అలాగే ర్యాగింగ్ కు పాల్పడితే చట్టపరమైన చర్యల గురించి వాళ్లకు తెలియజేస్తుంది.కొత్త విద్యార్థులందరూ : కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో ఏదైనా కోర్సులో ప్రవేశం పొందాలంటే, అందరు విద్యార్థులు తప్పనిసరిగా సంతకం చేసిన అఫిడవిట్‌ను సమర్పించాలి.ఏదైనా ర్యాగింగ్ సమస్య తలెత్తితే టోల్-ఫ్రీ నంబర్ 1800-180-5522 ను ఉపయోగించవచ్చు. helpline@antiragging.in కు మీ ఫిర్యాదును ఇమెయిల్ కూడా చేయవచ్చు.
…………………………………………………….
