* మంత్రి సీతక్క.
* అట్టహాసంగా జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రారంభం
ఆకేరున్యూస్, ములుగు: విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని, ఉపాధ్యాయులు తరగతి గదిలో బోధన చేసే సందర్భంలో వాస్తవిక దృక్పథాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకొని బోధించాలని రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. బుధవారం ములుగు జిల్లా జాకారంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల లో ములుగు జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన మరియు ఇన్స్పైర్ ప్రదర్శనను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిసరాల నుండి శాస్త్రీయ విజ్ఞానాన్ని నేర్చుకోవాలని, గతంలో శాస్త్రవేత్తలు అంతా కూడా సమాజాన్ని, ప్రకృతిని పరిశీలించి అనేక రకాల ఆవిష్కరణలు చేయడం జరిగిందని, అందులో భాగంగా విమానాన్ని తయారు చేయడం, ఓడలు తయారు చేయడం. ఇవన్నీ కూడా సహజసిద్ధంగా పక్షులు మరియు చేపల యొక్క జీవన విధానాన్ని అధ్యయనం చేసి ఆవిష్కరణ చేశారన్నారు. నేటి విద్యార్థులు కూడా మన భారతీయ శాస్త్రవేత్తల జీవితాలను, వారి ఆవిష్కరణను ఆదర్శంగా తీసుకొని నిత్యము పరిసరాలను పరిశీలిస్తూ సహజ సిద్ధ పరిస్థితులను గమనిస్తూ తద్వారా శాస్త్రీయ విజ్ఞానాన్ని నేర్చుకొని భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని మంత్రి పేర్కొన్నారు. జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను మంత్రి అభినందించారు. ములుగు జిల్లా లో కూడా అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు మట్టిలో మాణిక్యాలుగా ఉన్నారని, అటువంటి మాణిక్యాలను వెలికి తీసే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని, జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్, మండల విద్యాశాఖ అధికారి సామల శ్రీనివాసులు, స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ ఏ వెంకటేశ్వర్లు, జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు వివిధ సంఘాల జిల్లా బాధ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
………………………………….