* కాసులు ఇస్తేనే రిజిస్ట్రేషన్.. వరుస ఫిర్యాదులు
* ఏకకాలంలో కార్యాలయాలపై ఏసీబీ దాడులు
ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. అవినీతిపై వరుసగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు (ACB OFFICERS RIDES) నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. లెక్కల్లో చూపని నగదును భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులను చూసి డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు. కొందరు సిబ్బంది డబ్బు విసిరేసి నట్లు తెలిసింది. నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు, పెండింగ్‌లో డాక్యుమెంట్లు వంటి లోపాలను బట్టబయలు చేసేందుకు అధికారులు రికార్డులు తనిఖీ చేస్తున్నారు. ఏపీ (AP) వ్యాప్తంగా కీలకమైన 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై బుధవారం ఏకకాలంలో మెరుపుదాడులు నిర్వహించింది. విజయనగరం నుంచి చిత్తూరు వరకు పలు జిల్లాల్లో చేపట్టిన ఈ ఆకస్మిక సోదాల్లో లెక్కల్లో చూపని భారీ నగదుతో పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అనేక అక్రమాలు, రికార్డుల్లో తేడాలను అధికారులు గుర్తించారు. విశాఖపట్నం(VISAKHAPATNAM)లోని పెదగంట్యాడ, మధురవాడ, జగదాంబ సెంటర్‌తో పాటు విజయనగరం జిల్లా భోగాపురం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేట, ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, సత్యసాయి, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లోని ప్రధాన కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరిగాయి. భోగాపురం, జగదాంబ సెంటర్, ఇబ్రహీంపట్నం, ఒంగోలు, నెల్లూరు(NELLORE), నరసరావుపేట కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు (ACB RIDES) కొనసాగుతున్నాయి.
……………………………………..
