![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/download-30.jpg)
* కొత్త రేషన్‌కార్డు దరఖాస్తులపై శుభవార్త
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి పౌర సరఫరాల శాఖ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు దరఖాస్తుల స్వీకరణ అంశంలో నెలకొన్న అయోమయానికి తెర దించింది. కొత్త దరఖాస్తులు మీ సేవ ద్వారా స్వీకరించాలని నిర్ణయించింది. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్‌ను అధికారులు పునరుద్ధరించారు. ఈ పరిణామంతో మీసేవ వెబ్సైట్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కో దరఖాస్తుకు రూ.50 మాత్రమే వసూలు చేయాలని మీ సేవా నిర్వాహకులకు ప్రభుత్వం ఆదేశించింది. కాగా, రాష్ట్రంలో జనవరి 26 నుంచి కొత్త కార్డులు జారీ ప్రక్రియ మొదలైంది. గతంలో ప్రజాపాలన, గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్టలను మంజూరు చేశారు. అయితే, గత మూడు, నాలుగు రోజులుగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. మీ సేవ కేంద్రాల్లో కొత్త కార్డులకు అప్లయ్ చేసుకోవాలని ఈనెల 7 సివిల్ సప్లయ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, అదే రోజు రాత్రి 8 గంటలకు మీ సేవ పోర్టల్‌లో కొత్త రేషన్ కార్డులకు ఆప్షన్ కూడా కనిపించింది. మరుసటి రోజు ప్రజలు భారీగా మీ సేవ కేంద్రాలకు బారులు తీరారు. కానీ, ఆ వెంటనే మీసేవ పోర్టల్‌లో కొత్త రేషన్ కార్డు ఆప్షన్‌ను తొలగించారు.తాజాగా, మీ సేవలో కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులను స్వీకరించనున్నట్లుగా పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు.
……………………………